విరాట్ కోహ్లీకు నిర‌స‌న సెగ‌.. త‌ప్పుకోవాలంటూ డిమాండ్స్

భార‌త క్రికెట్‌లో మ‌రో ఆణిముత్యం విరాట్ కోహ్లీ. ఆయ‌న సాధించిన ప‌రుగులు కోహ్లీ ఖ్యాతిని తెలియ‌జేస్తాయి. అతి త‌క్కువ స‌మ‌యంలో ఎన్నో రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకున్న కోహ్లీ ఈ మ‌ధ్య కెప్టెన్‌గా ఫెయిల్ అవుతూ వ‌స్తున్నాడు. ఐపీఎల్ చ‌రిత్రలో కెప్టెన్‌గా ఘోరమైన విఫ‌లం చెందిన కోహ్లీ, భార‌త క్రికెట్ జ‌ట్టుకి కూడా మంచి విజయాలు అందించ‌లేక‌పోతున్నాడు. ధోని ఉన్న స‌మ‌యంలో ఆయ‌న స‌ల‌హాల‌తో మంచి విజ‌యాలే సాధించిన‌ప్ప‌టికీ, మిస్ట‌ర్ కూల్ రిటైర్ అయిన త‌ర్వాత కోహ్లీపై ప్రెషర్ చాలా పెరిగింద‌నిపిస్తుంది.

సుధీర్ఘ విరామం త‌ర్వాత ఆస్ట్రేలియా, భార‌త్ క్రికెట‌ర్స్ గ్రౌండ్‌లో అడ‌గుపెట్టారు. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల న‌ష్టానికి 374 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ రోజు వ‌న్డేలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్లు శతక భాగస్వామ్యాలు నెలకొల్పగా.. స్మిత్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగాడు. బుమ్రా,ష‌మీ, చాహ‌ల్ లాంటి అద్భుత‌మైన బౌల‌ర్స్ ఉన్న‌ప్ప‌టికీ వారిని స‌రిగ్గా ఉప‌యోగించ‌లేక‌పోతున్నందున ప్ర‌త్య‌ర్ధి టీం భారీ స్కోర్ చేస్తుంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ట్విట్టర్లో కోహ్లీ ‘కెప్టెన్సీ’పై చర్చ జరుపుతున్నారు.

కొంత కాలంగా ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీని రోహిత్ శ‌ర్మ‌కు ఇవ్వాల‌నే డిమాండ్ న‌డుస్తున్న క్ర‌మంలో ఇప్పుడు ఇది మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. కెప్టెన్‌గా కోహ్లీ రాణించ‌లేక‌పోతున్నాడు. అత‌ని వ్యూహాలు అన్ని బెడిసి కొడుతున్నాయి. మంచి ఆట‌గాడే కావొచ్చు, కాని కెప్టెన్సీకి మాత్రం కోహ్లీ అన‌ర్హుడు అంటూ సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌తో కోహ్లీకి త‌న కెప్టెన్సీ విష‌యంలో నిర‌స‌న సెగ త‌గులుండ‌గా, రానున్న రోజుల‌లో ప‌రిస్థితులు ఎలా మార‌తాయో చూడాలి.