IPL 2020: సైనీ ‘సూపర్‌’ ఓవర్‌.. ఆర్సీబీ ఖాతాలో సూపర్బ్‌ విక్టరీ

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ః 13లో రెండో ‘సూపర్‌’ విజయం నమోదైంది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జయకేతనం ఎగురవేసింది. సోమవారం దుబాయ్‌ వేదికగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. తొలుత ఈ మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు వెళ్లారు.

సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై వికెట్‌ నష్టానికి 7 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్‌ నవదీప్‌ సైనీ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. 8 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌ కోహ్లి, డివిలియర్స్‌లు కాస్త కంగారు పెట్టించినా చివరికి ఆర్సీబీకి విజయాన్ని అందించి పెట్టారు. సూపర్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ జస్ప్రిత్‌ బుమ్రా ఈ సారి తన జట్టును గెలిపించలేకపోయాడు.

అంతకుముందు ఆర్సీబీ విసిరిన 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ టై అయింది. లక్ష్య ఛేదనలో టాపార్డర్‌ ఘోరంగా విఫలమైనప్పటికీ ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), పొలార్డ్‌(60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో ముంబై రేసులోకి వచ్చింది. అయితే ముంబై విజయానికి చివరి ఓవర్‌లో 19 పరుగులు అవసరం కాగా 18 పరుగులే చేసింది. ఆఖరి ఓవర్‌ వేసిన నవదీప్‌ సైనీ చాలా క్లెవర్‌గా బౌలింగ్‌ చేశాడు. దీంతో మ్యాచ్‌ను ఆర్సీబీ కాపాడుకుంది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆర్సీబీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్ ‌(55; 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకానికి తోడు శివం దుబే (27; 9 బంతుల్లో, 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడడంతో ముంబై ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభం నుంచే ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్ ‌(54; 40బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆరోన్‌ ఫించ్ ‌(52; 35 బంతుల్లో 7 పోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. కెప్టెన్‌ కోహ్లీ (3; 11 బంతుల్లో) మరోసారి నిరాశపరిచాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.