IPL 2020: 14, 1, 3.. మళ్లీ పాత కోహ్లిని గుర్తుతెస్తున్నాడా!

దుబాయ్‌: విరాట్‌ కోహ్లి పరుగుల ప్రవాహం.. ధోని కూల్‌ కెప్టెన్సీ.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సిక్సర్లు.. ఇలా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-13 మొదలవుతుంది అనగానే అందరూ ఆశపడింది ఇలాంటివే. కానీ టోర్నీ ప్రారంభమై వారం గడుస్తున్నా.. ప్రతీ జట్టు రెండు మూడేసి మ్యాచ్‌లు ఆడినా అభిమానులు ఆశ పడిన క్రికెటర్ల ఆట కనపడలేదు. ముఖ్యంగా టీమిండియా పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి ఘోరంగా తడబడుతున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో వచ్చిన గ్యాప్‌ను ఫుల్‌ ఫిల్‌ చేస్తూ.. ఐపీఎల్‌లో ఆకలితో ఉన్న పులిలా పరుగుల వరద సృష్టిస్తాడని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లి ఘోరంగా విఫలమయ్యాడు.

సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 13 బంతులాడిన ఈ రన్‌మెషీన్‌ 14 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. ఇక నేడు డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ లోనూ 11 బంతులాడి మూడు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ కోహ్లి వైఫల్యం చెందడం అతడితో పాటు ఐపీఎల్‌ అభిమానులను తీవ్రంగా కలవరానికి గురిచేస్తోంది. ఇక బ్యాట్స్‌మన్‌గా వైఫల్యం చెందడమే కాకుండా ఫీల్డింగ్‌ లోనూ సులువైన క్యాచ్‌లను నేలపాలు చేస్తున్నాడు. దీంతో విమర్శకులకు కోహ్లి మరింత ఊతమిచ్చినట్టయింది. ఇదే అదునుగా కాచుక్కూర్చున్న కోహ్లి హేటర్స్‌ అప్పుడే సెటైర్లు వేయడం ప్రారంభించారు.

2012 కోహ్లిని మళ్లీ గుర్తు చేస్తున్నాడని కొందరు విమర్శిస్తుండగా.. కోహ్లి తిరిగి ఫామ్‌ అందిపుచ్చుకోవాలని మరికొంతమంది ఆశపడుతున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు, ఐదు వేల మార్క్‌ను చేరుకున్న రెండో ఆటగాడిగా ఘనత అందుకున్న కోహ్లి ఇలా వరుసగా విఫలమవ్వడం ఎవరికీ రుచించడం లేదు.