అబుదాబి: ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇండియన్స్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన కోహ్లి.. కీలక మ్యాచ్‌లో అసలు సిసలైన తన ఆటను బయటకు తీశాడు. దీంతో శనివారం అబుదాబి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్ (63; 45 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (72 నాటౌట్; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో 19.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్(5), జోస్ బట్లర్(22), సంజూ శాంసన్(4) వికెట్లను ఐదు ఓవర్లలోపే కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇసుర ఉదాన వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి స్మిత్ బౌల్డ్ కాగా, కాసేపటికి సైనీ బౌలింగ్‌లో బట్లర్ పెవిలియన్ చేరాడు. దేవదత్ పడిక్కల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో బట్లర్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక సంజూ శాంసన్ కూడా విఫలయ్యాడు. దాంతో 31 పరుగులకే రాజస్తాన్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై రాబిన్ ఊతప్ప-లామ్రోర్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కానీ ఊతప్ప(17) నాల్గో వికెట్‌గా ఔట్ కావడంతో రాజస్తాన్‌ను లామ్రోర్ ఆదుకున్నాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా లామ్రోర్ మాత్రం నిలకడగా ఆడాడు. 39 బంతుల్లో 1 ఫోర్, 3సిక్స్‌లతో 47 పరుగులు సాధించి రాజస్తాన్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇది లామ్రోర్‌కు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్. చివర్లో ఆర్చర్(16 నాటౌట్; 10 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్)), రాహుల్ తెవాటియా(24 నాటౌట్; 12 బంతుల్లో 3 సిక్స్‌లు)లు బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్ మూడు వికెట్లు సాధించగా, ఉదాన రెండు వికెట్లు తీశాడు. సైనీకి వికెట్ దక్కింది.