షార్జా: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తన అరంగేట్ర మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన తొలి బంతికే ఔటవ్వడంతో గోల్డెన్ డక్ అయ్యాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో లేని కారణంగా అంబటి రాయుడి స్థానంలో జట్టులోకి వచ్చిన రుతురాజ్ తనకి వచ్చిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాజస్తాన్ బౌలర్ తెవాటియా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ఇక సీఎస్‌కే తర్వాత ఆడబోయే మ్యాచ్‌కు అంబటి రాయుడు అందుబాటులో ఉండే అవకాశం ఉండటం, సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ రాణిస్తుండటంతో రుతురాజ్‌కు సారథి ధోని మరో అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.
ఇక రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు రాయుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే విజయ్‌పై వేటు పడేదే. ఎందుకంటే రుతురాజ్ జట్టులో ఉండటం ఖాయమని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తెలపడంతో అందరూ విజయ్‌నే పక్కకు పెడతారని ఊహించారు. కానీ అనూహ్యంగా రాయుడి స్థానంలో ఈ యువ ఆటగాడు జట్టులోకి వచ్చాడు. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఢిల్లీతో మ్యాచ్‌కు విజయ్‌ను పక్కకు పెట్టి రుతురాజ్‌ను తీసుకునే ధైర్యం ధోని చేయకపోవచ్చని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. దీంతో విజయ్ తర్వాతి మ్యాచ్‌కు సేఫ్ అని వారు అంటున్నారు. ఇక విశ్లేషకుల అంచనాలే నిజమవుతాయా.. లేక ధోని వినూత్నంగా ఆలోచించి ఊహకందని నిర్ణయాలు తీసుకుంటాడో 25న చూడాలి.
కాగా, ఐపీఎల్-13లో సీఎస్‌కే తొలి ఓటమిని చవిచూసింది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్(74; 32 బంతుల్లో 1×4, 9×6), స్టీవ్ స్మిత్(69; 47 బంతుల్లో 4×4, 4×6) సిక్సుల వర్షం కురిపించగా.. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్(27; 8 బంతుల్లో 4×6) సైతం అదే పనిచేశాడు. 217 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్(72; 36 బంతుల్లో 1×4, 7×6) చెలరేగినా ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. షేన్‌వాట్సన్(33), మురళీ విజయ్(21), సామ్ కరన్(17), కేదార్ జాధవ్(22) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. చివరి ఓవర్‌లో కెప్టెన్ ధోనీ(28; 16 బంతుల్లో 3×6) హ్యాట్రిక్ సిక్సులు బాదడంతో ఆ జట్టు స్కోర్ 200కి చేరింది.