కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ఆసక్తిరేపిన రాజకీయ సమీకరణాలు, కేసుల ఒత్తిళ్లు, ప్రత్యర్థుల సవాళ్ల నడుమ సాగిన స్థానిక సంస్థల పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘనవిజయాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. సాంప్రదాయకంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా భావించే పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.
హోరాహోరీగా సాగిన గన్నవరం జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకోవడమే కాకుండా, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కీలకమైన ఎంపీటీసీ స్థానాల్లోనూ ఫ్యాన్ గుర్తు అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. సూరంపల్లి 2, గన్నవరం 2లతో పాటు ఆవుట్ పల్లి, అజ్జంపూడి, గొల్లనపల్లి ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుని గ్రామీణ స్థాయిలో తన పట్టును నిరూపించుకుంది. ఈ ఎన్నికల విజయంలో వల్లభనేని వంశీమోహన్ వ్యూహాత్మక పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది.
గత కొంతకాలంగా అనేక చట్టపరమైన చిక్కులు, పోలీసు కేసులు ఎదురైనప్పటికీ క్షేత్రస్థాయిలో కేడర్ చెల్లాచెదరు కాకుండా కాపాడుకోవడంలో ఆయన విజయం సాధించారు. స్వయంగా ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనలేకపోయినా, తన సొంత ఇమేజ్, కేడర్‌పై ఉన్న పట్టుతోనే అభ్యర్థులను గెలిపించుకోగలిగారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అధికార కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, వంశీ మార్కు గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ వైఎస్సార్సీపీని విజయతీరాలకు చేర్చిందని స్థానిక రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గన్నవరంలో నమోదు చేసిన ఈ ఫలితాలు నియోజకవర్గంలో వంశీ ప్రాబల్యం ఇంకా ఎంత బలంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.