చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అసలు ఇక్కడ గెలిచింది టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానినా, లేక ఆయన సతీమణి సుధారెడ్డా..? అనే సందేహాలు నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఆమె చేస్తున్న హడావుడి, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం కాస్త హద్దులు దాటుతోందనే అభిప్రాయాలు సొంత పార్టీ శ్రేణులతో పాటు సాధారణ జనం నుంచి కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వెనుక ఉండి నడిపించాల్సింది పోయి, తానే సర్వస్వం అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా సుధారెడ్డి చేసిన హంగామా నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లగా, సుధారెడ్డి తన వాహనంతో ఆయన కారును వెంబడించడం స్థానికంగా కలకలం రేపింది. “నేను చెవిరెడ్డికి ఎస్కార్ట్.. ఆయన ఎక్కడికి వెళ్తే నా వాహనం కూడా అక్కడికే వస్తుంది” అంటూ పోలింగ్ బూత్‌ల వద్ద ఆమె చేసిన వ్యాఖ్యలు, హడావుడి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల వేళ శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి, ప్రత్యర్థి పార్టీ నేతలను కావాలనే రెచ్చగొట్టేలా ఆమె ప్రవర్తించారని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతోనే సుధారెడ్డి ఇలాంటి ‘అతి’ చేష్టలకు దిగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆమె సవాళ్లకు లొంగకుండా ఎంతో సంయమనంతో వ్యవహరిస్తే, సుధారెడ్డి మాత్రం నియోజకవర్గంలో తానే షాడో ఎమ్మెల్యే అన్న చందంగా రోడ్లపైకి వచ్చి రచ్చ చేయడంపై సొంత కూటమి నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా గెలిచిన భర్తను పక్కనబెట్టి, ప్రోటోకాల్‌తో సంబంధం లేకుండా ఆమె చేస్తున్న ఈ ఓవరాక్షన్ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టను మసకబారుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.