వైసీపీ వైపు చూస్తున్న మాగంటి ఫ్యామిలీ..?

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని కామవరపుకోట జడ్పీటీసీ స్థానం కూటమి అభ్యర్థిత్వంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. సోమవారం రాత్రి వరకు ఈ సీటు మాజీ ఎంపీ మాగంటి బాబు భార్యకే దక్కుతుందంటూ ప్రచారం సాగడం, వారి అనుచరులు సోషల్ మీడియాలో హడావిడి చేయడం కనిపించింది. అయితే, సోమవారం అర్ధరాత్రి దాటాక రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి.

చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ సైలెంట్‌గా ఉంటూనే తన రాజకీయ వ్యూహంతో అధిష్టానం వద్ద చక్రం తిప్పారు. చివరకు తన కుమార్తె మందలపు జాహ్నవికి తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థినిగా బీ-ఫామ్ ఇప్పించుకోవడంలో ఆయన పైచేయి సాధించారు. ఘంటా మురళి సాధించిన ఈ పొలిటికల్ విక్టరీ వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. గత ఐదేళ్లపాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా చింతలపూడి నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించిన నేతల్లో ఒకరిగా ఆయనకు గట్టి గుర్తింపు ఉంది.

పైగా ఈ స్థానానికి చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉంది. గతంలో 2001లో ఇదే కామవరపుకోట మండలం నుంచి జడ్పీటీసీగా ఘంటా మురళి భారీ విజయం సాధించారు. ఆ పదవిలో కొనసాగుతూనే ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇప్పుడు సరిగ్గా 12 ఏళ్ల విరామం తర్వాత మురళి ఫ్యామిలీ నుంచి ఆయన కుమార్తె మందలపు జాహ్నవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ, నాడు తండ్రి పోటీ చేసి గెలిచిన స్థానం నుంచే నేడు జడ్పీటీసీగా బరిలోకి దిగుతుండటం విశేషం. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వం కూడా మురళి సీనియారిటీ, నియోజకవర్గ సేవలను పరిగణనలోకి తీసుకుని ఆయన వైపే మొగ్గు చూపింది.

అయితే, ఈ సీట్ల కేటాయింపు జిల్లా కూటమి రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపానికి దారితీసిందనే చర్చ నడుస్తోంది. చివరి నిమిషం వరకు ఈ సీటు తన భార్యకే ఖరారైందని భావించిన మాగంటి బాబుకు ఇది కోలుకోలేని పెద్ద షాక్‌గా మారింది. ఈ పరిణామాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్న మాగంటి బాబు ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ అధిష్టాన వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు భోగట్టా. ఈ క్రమంలోనే వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో టచ్‌లోకి వెళ్లినట్లు జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో సమాచారం అందుతోంది. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాగంటి కుటుంబం.. ఈ అవమాన భారం తట్టుకోలేక వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతోందనే వార్తలు ఏలూరు జిల్లాలో ఇప్పుడు పెను సంచలనం రేపుతున్నాయి.