టి. త్రివిక్రమ రావు తెలుగు చలనచిత్ర సినీ నిర్మాత. ఈయన విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ స్థాపించి ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి మొదలైన ప్రముఖ హీరోలతో విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. హిందీలో కూడా జితేంద్ర హీరోగా పలు సినిమాలు నిర్మించాడు.
త్రివిక్రమ రావు విద్యాభ్యాసం తరువాత సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా రాణించాలని తెలిసిన వాళ్ళ ద్వారా దర్శకుడు సి. ఎస్. రావు గారిని కలిశారు. అప్పుడు ఆయన ఎన్టీఆర్ నటిస్తున్న వాల్మీకి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ రావు ఆసక్తిని చూసి సి. ఎస్. రావు గారు దర్శకత్వ శాఖలో చేర్చుకున్నారు.
వాల్మీకి సినిమా తరువాత దర్శకత్వం కంటే నిర్మాణరంగంలోని బాగుంటుందని భావించిన త్రివిక్రమ రావు. సి. ఎస్. రావు దర్శకత్వం వహించిన ప్రచండ భైరవి సినిమాను నిర్మించడం జరిగింది. ఈ సినిమా సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఇక దాదాపు పది సంవత్సరాలపాటు సినిమా రంగం వైపు రాలేదు.
తరువాత తండ్రి ప్రోత్సాహంతో 1979లో శోభన్ బాబు నటించిన మొనగాడు చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత అదే సంవత్సరంలో తమిళంలో వచ్చిన పొట్టేలు పున్నమ్మ సినిమాను రీమేక్ చేసి మురళీమోహన్ హీరోగా ఈ చిత్రాన్ని త్రివిక్రమ రావు నిర్మించడం జరిగింది. ఈ రెండు సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి.
ఇక చిత్ర పరిశ్రమలో వరుసగా నిర్మించిన చిత్రాలు విజయ పదంలో ముందుకు సాగుతుండగా వెనుకకు తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించడం జరిగింది. దాదాపు అందరూ అగ్ర హీరోలతో ఈయన సినిమాలు నిర్మించడం జరిగింది.
ఇక అక్కినేని నాగార్జున హీరోగా.. కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక సినిమా నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత షూటింగుకు ముందు ఆ సినిమా ఆగిపోవడం జరిగింది. ఇక మానసికంగా ఎంతో బాధను అనుభవించాడు.
ఆ సమయంలో తనతో సినిమా చేస్తానని ఏ అగ్ర హీరో ముందుకు రాకపోవడం జరిగింది. ఇక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక 2008లో గుండెపోటుతో హైదరాబాదులో మరణించడం జరిగింది.