ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ పార్టీని అన్ని వైపుల నుండి బలోపేతం చేసుకున్నారు. ఏ విభాగాన్నీ వదలకుండా అన్నింటినీ సమన దృష్టితో చూస్తూ ముందుకెళ్లారు. ఎక్కడికక్కడ సమన్వయకర్తలను నియమించుకుని ఖర్చుకి వెనుకాడకుండా తమకు అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జగన్ ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. ఎన్నికలకు ముందు రెండేళ్లపాటు తెలుగు సోషల్ మీడియా మొత్తం జగన్ ప్రభంజనం నడిచింది. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రత్యేక శ్రద్ధపెట్టి ఒక కార్యాచరణను నిర్ధేశించగా విజయసాయిరెడ్డి బాధ్యతలను భుజాన వేసుకుని సామాజిక మాధ్యమాల్లో పార్టీకి ప్రచార కల్పించుకున్నారు.
వేల సంఖ్యలో అకౌంట్లు వేల మంది ఫాలోవర్లను కలిగి ఉండి జగన్ వైపు పనిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో సైన్యాన్ని నడిపించారు. జగన్ హామీలతో పాటు చంద్రబాబు వైఫల్యాలను ఎత్తిచూపడమే ఈ సోషల్ మీడియా సైనికుల పని. ఒకానొక దశలో యువతను పూర్తిగా వేరే మూడ్ లోకి తీసుకెళ్లిపోయారు. ఇందుకుగాను ఆ సైన్యానికి బాగానే ప్రతిఫలం అందినట్టు చెబుతుంటారు. జగన్ సీఎం అయ్యాక కూడ సోషల్ మీడియా సైన్యం యాక్టివ్ స్టేట్లోనే ఉండేది. జగన్ చేసే సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. కానీ ఈమధ్య ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు వారందరూ.
గతంలో జగన్ మీద ఈగ వాలనివ్వని సైన్యం ఇప్పుడు ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నా పెద్దగా రియాక్ట్ కావట్లేదు. రామతీర్థం ఘటన విషయంలో ప్రభుత్వం మీద, వైఎస్ జగన్ మీద సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎక్కువయ్యాయి. మంత్రివర్గాన్ని గట్టిగ టార్గెట్ చేస్తున్నారు. పలు విధాలుగా నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం గతంతో పోలిస్తే బాగా పుంజుకుంది. ఇక జనసేన శ్రేణులు ఎలాగూ ఉండనే ఉన్నారు. ఇద్దరూ కలిసి వైసీపీని, జగన్ పాలనను ఎండగట్టేస్తున్నారు. కీలకమైన అంశాల్లో తమదైన విశ్లేషణలు ఇస్తూ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. అయినా వైసీపీ విభాగం వారికి ధీటుగా సమాధానం చెప్పట్లేదు.
గతంలో సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద నిరాధార ఆరోపణలు చేస్తే కేసులు నమోదుచేవారు సీఐడీ వారు. ఆ దెబ్బతో ఇతర పార్టీల సోషల్ మీడియా భక్తులు వెనక్కుతగ్గుతారని వైసీపీ నాయకులు భావించారు. కానీ దాడి రెట్టింపైంది. చెప్పాలంటే వైసీపీ సోల్జర్స్ హడావుడే తగ్గిపోయింది. జడ్జీల మీద విపరీత వ్యాఖ్యలు చేసినందుకుగాను వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులకు హైకోర్టు నోటీసులు పంపింది. దాంతో వారిలో భయం మొదలైంది. విజయసాయిరెడ్డి పలుమార్లు మీటింగ్లు పెట్టి ధైర్యం నూరిపోసినా లాభం లేకపోయింది. మరోవైపు గతంలో పార్టీ వారి మీద చూపినంత ఆదరణ ఇప్పుడు చూపట్లేదని, అందుకే అలిగిన వారంతా నిరసనగా సైలెంట్ అయిపోయారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వైసీపీ సోషల్ సైన్యం గతంలో ఉన్నంతా హుషారుగా ఇప్పుడైతే లేదు.