జగన్ గుండెల మీద కుంపటి పెట్టిన ఎమ్మెల్యే !

Talari Venkatrao
వైసీపీ నేతలు తమ అధినేత వైఎస్ జగన్ దృష్టిలో పడాలని రకరకాల పాట్లు పడుతుంటారు.  అసలే జగన్ మమసులో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తన ఫోటో పెట్టుకునే గెలిచారని, ఎన్నికల్లో అభ్యర్థుల వ్యక్తిగత చరీష్మా ఏదీ పనిచేయలేదనే ఆలోచన ఉందనే అనుమానం చాలామందిలో ఉంది.  జగన్ సైతం అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఇప్పటికీ తన ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో ఒక్కసారి కూడా ఫేస్ టూ ఫేస్  మాట్లాడకపోవడం ఆ అనుమానికి బలాన్నిస్తోంది.  ఇది ప్రజల్లోనే కాదు అధికార పార్టీ నేతల్లో కూడా ఉంది.  అందుకే వారంతా అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ దృష్టిలో పడటానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.  కొందరైతే అవకాశాన్ని సృష్టించుకుని మరీ స్వామి భక్తిని చాటుకునే పనిలో ఉంటున్నారు. 
 
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కూడా అలాంటి అవకాశాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో భాగంగా విపరీత చర్యకు తెర లేపారు.  అదే ముఖ్యమంత్రికి గుడి కట్టడం.  ఎప్పటి నుంచి ఈ ఆలోచన ఉందో కానీ తాజాగా గుడికి భూమి పూజ కూడా చేసేశారు.  అదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.  అది కూడా మతపరమైన విమర్శలు.  వైఎస్ జగన్ క్రిస్టియన్.  ఆయన ఆచార వ్యవహారాలన్నీ క్రైస్తవ మత పరంగానే ఉంటాయి.  అలాంటప్పుడు ఆయనకు హిందూ మత వ్యవస్థను అనుసరించి గుడి ఎలా కడతారనే విమర్శలు మొదలయ్యాయి.  స్వయంగా వైసీపీ ఎంపీ రాఘురామరాజు సైతం క్రిస్టియన్ అయిన జగన్ గారికి గుడి కట్టడం ఏమిటి విపరీతం కాకపోతే అంటున్నారు.  జగన్ అంటే అందరికీ అభిమానమేనని కానీ ఆ అభిమానం పేరుతో ఇలా మతాలను కించపరచడం తగదని, కావాలంటే చర్చి కట్టుకోమని సలహా ఇచ్చారు. 
 
అయన మాటల్లో వాస్తవం లేకపోలేదు.  రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా మతం అనేసరికి జనం ఒకటైపోతారు.  ప్రత్యర్థి వర్గం వారే కాదు జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా అభిమానించే వారు కూడా ఇదేం విపరీతం అంటూ ఎమ్మెల్యే చేసిన పనికి ముక్కున వేలేసుకుంటున్నారు.  గతంలో తిరుపతిలో అన్యమత ప్రచారం, నిర్భంధ ఇంగ్లీష్ మీడియం క్రైస్తవ మతాన్ని ప్రొత్సహించడానికే అంటూ పుకార్లు పుట్టినప్పుడు తిప్పికొట్టిన వారు సైతం ఈ గుడి అంశంలో మత విశ్వాసాలకు ప్రాధాన్యమిస్తూ ఆలోచన చేస్తున్నారు.  అభిమానం ఉంటే సదరు ఎమ్మెల్యే ఇంట్లో జగన్ ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవాలి కానీ ఇలా జనంలోకి వచ్చి గుడి కడతాను అనడం ఏమిటని అంటున్నారు.  ఇంకొందరైతే తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది.  రోజుకు వెయ్యికి తక్కువ కాకుండా కేసులు వస్తున్నాయి.  ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వైద్య సేవల మీద దృష్టి పెట్టకుండా గుడి కడతాననడం బాధ్యతాయుతమైన చర్య కాదని మండిపడుతున్నారు.  మొత్తానికి ఎమ్మెల్యే వెంకట్రావు గుడి కట్టడం ఏమో కానీ జగన్ గుండెల మీద కుంపటి పెట్టారు.