బెస్ట్ సీఎంల జాబితాలో వైఎస్ జగన్ స్థానం ఎక్కడంటే 

ప్రముఖ వార్తా సంస్థ ఇండియాటుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చేపట్టిన సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మొదటి మూడు స్థానాల్లో ఒకదాన్ని దక్కించుకున్నారు.  జూలై 15 నుండి జూలై 27 వరకు నిర్వహించిన ఈ సర్వేలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు పట్ల ప్రశ్నలు రూపొందించి అభిప్రాయాలను తె లుసుకుని ఓట్ల శాతాన్ని కేటాయిస్తారు.  ప్రతిసారీ వ్యక్తులను నేరుగా కలిసి అభిప్రాయాలను తీసుకునే ఈ సంస్థ ఈసారి కోవిడ్ పరిస్థితుల కారణంగా టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు తీసుకుని ఓట్లను కేటాయించారు.  19 రాష్ట్రాల్లో కలిపి 97 పార్లమెంటరీ, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,027 మంది అభిప్రాయాల ద్వారా ముఖ్యమంత్రులకు ర్యాంకింగ్స్ కేటాయించారు. 
 
ఈ జాబితాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ 100 శాతం ఓట్లలో 11 శాతం ఓట్లను దక్కించుకుని మూడవ ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలవగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 24 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు.  రెండవ స్థానంలో 15 శాతం ఓట్లతో ఢిల్లీ సీఎం అరవింద్ కెజ్రీవాల్ నిలిచారు.  ఈ జాబితాలో డబుల్ డిజిట్ ఓట్లను పొందిన ముఖ్యమంత్రులు యోగి, జగన్, కెజ్రీవాల్ మాత్రమే.  మిగతావారు సింగిల్ డిజిట్ వద్దే ఆగిపోయారు.  ఇక మరొక తెలుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ 3 శాతం ఓట్లతో తొమ్మిదవ స్థానానికి పరిమితమయ్యారు.  కేసీఆర్ జాబితాలో ఇలా కింది స్థానానికి జారిపోవడానికి కారణం కరోనా పై పోరులో చూపిన అలసత్వం, అనవసర గోప్యతే అనుకోవచ్చు. 
 
ఇక వైఎస్ జగన్ గడిచిన యేడాది పాలనలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలుచేయడమే.  సుమారు 40,000 వేల కోట్లను 3.9 కోట్ల మంది ప్రజలకు నేరుగా అందించారు.  అలాగే దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారు జగన్.  అంతేకాదు మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందేలా చేయడం కూడా జగన్‌ను మూడవ ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలబెట్టింది.  ఇదివరకెన్నడూ సర్వేల్లో తెలుగు ముఖ్యమంత్రులు ఇలా టాప్ త్రీలో నిలబడిన సందర్భాలు లేవు.  అలాంటిది జగన్ మూడవ ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడం హర్షించదగిన విషయం.