Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించిన జగన్.. సమంజసం కాదంటూ ఆగ్రహం!

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం సంచలనం రేపింది. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. సంధ్య థియేటర్ కేసులో భాగంగా అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బన్నీకు నాంపల్లి కోర్టు 2 వారాల పాటు జ్యుడీషియల్ రిమాండ్ ను విధించింది. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ అరెస్టు విషయంపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. బన్నీ అరెస్టును జగన్ ఖండించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణించడం బాధాకరమని, ఆమెను తిరిగి తీసుకురాలేమని అన్నారు. ఆ అభిమాని మృతిపై అల్లు అర్జున్ తన విచారం వ్యక్తం చేశారని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసాని ఇచ్చారని జగన్ చెప్పారు. అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించారని, అయినా కూడా ఈ ఘటనకు ఆయనను నేరుగా బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు జగన్.

ఈ ఘటనలలో అల్లు అర్జున్ ప్రమేయం లేనప్పటికీ క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమంజసం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై అల్లు అర్జున్ తరఫు లాయర్లు, ప్రభుత్వం, పోలీసుల తరఫు లాయర్లు వాడీవేడీ వాదనలు వినిపిస్తున్నారు. ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.