ఏపీలో రాజకీయాలు ఎటెటో వెళ్తున్నాయి కదా. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా కులాలు, మతాలు అంటూ భేదాలు పుట్టుకొచ్చాయి. మా మతాన్ని కించపరుస్తున్నారు అని ఓ వర్గం.. లేదు మా మతాన్ని కించపరుస్తున్నారు అంటూ మరో వర్గం.. ఇంకోవైపు మా కులాన్ని తక్కువ చేస్తున్నారని.. ఇలా కులాలు, మతాల కోసం కొట్టుకునే స్థాయికి దిగజారాయి రాజకీయాలు.
ఓవైపు బీజేపీ, జనసేన ఏమంటుంది అంటే.. హిందూ మతంపై కావాలని కొన్ని దుష్టశక్తులు దాడులు చేస్తున్నాయి. అది కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాడులు ఎక్కువయ్యాయి అంటూ ఆరోపిస్తున్నారు.
ఈ మధ్యనే దేవాలయాల మీద దాడులు జరగడం అందరం చూస్తూనే ఉన్నాం. ఏపీలో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయనేది అందరికీ తెలిసిందే. కానీ.. దీని వెనుక ఉన్నది ఎవరు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇదివరకు కూడా రెండుమూడు సార్లు కొన్ని ఆలయాల్లో రథాలు దగ్ధమయినప్పటికీ అంతర్వేది ఘటనపై చాలా దుమారం లేచింది. ఈ ఘటనపై ప్రతిపక్షాల కంటే ముందే ప్రభుత్వం స్పందించింది.
ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించినా.. ప్రతిపక్షాలు మాత్రం ఆందోళనలు చేయడంతో వెంటనే సీబీఐకి కేసును అప్పగించాలంటూ ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. దీంతో బంతి కాస్త వెళ్లి బీజేపీ కోర్టులో పడింది. అప్పటి వరకు జగన్ పై ఆరోపణలు చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కసారిగా విమర్శలు ఆపాల్సి వచ్చింది.
ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉన్నప్పుడు ఏపీలో బీజేపీ మాట్లాడే చాన్సే ఉండదు. ఎందుకంటే అంతర్వేది కేసును సీబీఐ తేల్చాలి. సీబీఐ తేల్చితేనే అది కొలిక్కి వస్తుంది. ఏపీ బీజేపీ నేతలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కేంద్రంతో మాట్లాడి అయినా సీబీఐ విచారణను వేగవంతం చేయించి… అంతర్వేది ఘటన వెనుక ఉన్న అసలు నేరస్తులను పట్టుకునేలా చేయాలంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.