గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా హత్రాస్ ఘటన మీదే చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఎంతో క్రూరంగా బాధితురాలిపై అఘాయిత్యం చేసి ప్రాణాలు తీసిన నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కూడా సరిగ్గా స్పందించడం లేదని.. ప్రభుత్వం ఏదో దాస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బాధితురాలి మృతదేహాన్ని సీక్రెట్ గా కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా దహనం చేయడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏంటని దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వెంటనే సీబీఐ రంగంలోకి దిగి.. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు.
అయితే.. ఇప్పటికే యూపీ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. రేపు అంటే ఆదివారం సాయంత్రం 4 గంటల లోపు హత్రాస్ ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ సిట్ బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది.