పచ్చ కామెడీ.! పులివెందులలో వైఎస్ జగన్ ఓడిపోతారట.!

కామెడీకే పరాకాష్ట ఇది. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి తిరుగు లేదని తెలిసీ, ఆ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోబోతోందంటూ యెల్లో మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోంది. ఔనా, 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారా.? అని జనం ముక్కున వేలేసుకుంటూ, యెల్లో మీడియా మీద, తెలుగుదేశం పార్టీ మీదా జాలి ప్రదర్శిస్తున్నారు.

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎలాగైనా మారిపోవచ్చు. వైఎస్ విజయమ్మ, విశాఖ నుంచి ఓడిపోలేదా.? రాజకీయాల్లో మహామహులకే ఓటమి తప్పకపోవచ్చు. రాజకీయాలంటేనే అంత. కానీ, పులివెందుల వ్యవహారం వేరు. అక్కడ వైఎస్ కుటుంబానికి తిరుగు లేదు. భయం అనండీ, అభిమానం అనండి.. ఏదైతేనేం, వైఎస్ కుటుంబాన్ని ఓడించేంత సీన్ పులివెందులలో ఏ రాజకీయ పార్టీకీ లేదు.

ఇది టీడీపీ అనుకూల మీడియాకీ, టీడీపీకీ బాగా తెలుసు. కానీ, కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా టార్గెట్ చేసిన దరిమిలా, పులివెందుల నియోజకవర్గాన్ని టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కుప్పంలో వైసీపీ ఆటలు సాగుతున్నాయ్.. కానీ, పులివెందులలో టీడీపీ ఆటలు సాగవు.

మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైఎస్సార్సీపీ వ్యవహరిస్తున్న వైఖరి పట్ల పులివెందుల నియోజకవర్గ ప్రజలు వైసీపీ మీద అసహనంతో వున్నారట. వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత నీతిమంతుడని టీడీపీ అనుకూల మీడియా సర్టిఫికెట్ ఇచ్చేస్తోంది. ఇదే వైసీపీ అనుకూల మీడియా గతంలో వివేకానందరెడ్డి మీద చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.

పులివెందులలో అస్సలు అభివృద్ధి జరగలేదన్నది టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా వాదన. మరి, కుప్పం పరిస్థితేంటి.? కుప్పంలో చంద్రబాబు ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పులివెందులలో వైఎస్ జగన్‌కి గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థి మాత్రం టీడీపీలో కనిపించడంలేదు. అయినా, వైఎస జగన్‌ని టీడీపీ ఓడించేస్తుందని యెల్లో మీడియా జోస్యం చెబుతోంది. నమ్మాల్సిందే.. కాదు కాదు, నవ్వుకోవాల్సిందే.. ఎందుకంటే, కామెడీ కదా మరి.!