కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వింతలేమీ చోటు చేసుకోలేదు. అంతా ఊహించినట్టుగానే వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ బంపర్ విక్టరీ అందుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికి విజయాన్ని కట్టబెట్టారు.
2019 ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య వైసీపీ నుంచి బద్వేలు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, కొన్నాళ్ళ క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో బద్వేలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరైంది. మామూలుగా అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో, ఈ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసి వుండాల్సింది.
టీడీపీ, జనసేన.. తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపలేదు.. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి పోటీ చేస్తుండడంతో. బీజేపీ మాత్రం షరామామూలుగానే అతి ప్రదర్శించింది, ఫలితాన్ని అనుభవిస్తోంది. కాంగ్రెస్ సైతం, ఇక్కడ ఉనికిని చాటుకోలేకపోతోంది.
కాగా, జనసేన పార్టీ బరిలోకి దిగకపోయినా, బీజేపీకి మద్దతు ప్రకటించి.. డబుల్ గేమ్ ఆడింది. బీజేపీకి మద్దతు ప్రకటించి వుండకపోతే, జనసేన పట్ల కాస్తో కూస్తో పాజిటివిటీ నియోజకవర్గంలో వచ్చి వుండేదేమో. బీజేపీకి, జనసేన మద్దతు పలికిన దరిమిలా, రెండు పార్టీలూ సంయుక్తంగా ఓటమిని చవిచూసినట్లయ్యింది.
మొదటి రౌండ్ నుంచే బంపర్ మెజార్టీ సాధిస్తూ వచ్చారు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ. తన భర్త గతంలో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇప్పుడు డాక్టర్ సుధ సాధించారు. సంక్షేమ పథకాల్ని సమర్థవంతంగా అమలు చేయడమే తమ విజయరహస్యం.. అంటోంది వైసీపీ.
రాష్ట్రంలో వైసీపీకి రాజకీయ ప్రత్యామ్నాయం లేదనే విషయం బద్వేలు ఉప ఎన్నికతో నిరూపితమయ్యిందనీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలంతా సంతోషంగా వున్నారనడానికి బద్వేలు ఉప ఎన్నికే నిదర్శనమనీ వైసీపీ నేతలు అంటున్నారు. కాగా, డాక్టర్ సుధ సాధించిన పూర్తి మెజార్టీ వివరాలు సాయంత్రానికి వెల్లడయ్యే అవకాశాలున్నాయి.