MLA Roja : రాజకీయాల్లో సెటైర్లకు ఇటీవల పెరిగిపోయిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ తరహా సెటైర్లేయడంలో ఒకర్ని మించి ఇంకొకరు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. స్పాంటేనియస్‌గా సెటైర్లేసే రాజకీయ నాయకులు కొందరైతే, మరికొందరు ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుల ఆధారంగా కూడా సెటైర్లేస్తుండడం చూస్తున్నాం. ఇంతకీ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏ కేటగిరీకీ చెందుతారు.?
అసలు విషయమేంటంటే, వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన స్టయిల్లో అసెంబ్లీ సాక్షిగా స్వామి భక్తిని చాటుకున్నారు. అధినేత వైఎస్ జగన్ మెప్పు పొందేందుకు, విపక్షాలపై బీభత్సమైన సెటైర్లు పేల్చేశారు. చంద్రబాబుని అనకొండతో పోల్చి, ఆయన కుమారుడ్ని పప్పుండగా అభివర్ణించారు. బాలయ్య మాత్రం అఖండ అట.
ఇక, రాష్ట్రంలో పొత్తుల రాజకీయం గురించి రోజా మాట్లాడుతూ, ‘జొన్నపొత్తులు’ అంటూ వెటకారం చేశారు. సొంతంగా పోటీ చేయలేని జొన్న పొత్తులంటూ టీడీపీ, జనసేన మీద సెటైర్లేశారు రోజా. ఈ సెటైర్లు సోషల్ మీడియాలో చాలా గట్టిగా పేలుతున్నాయ్. అదే సమయంలో వాటికి ధీటుగా రోజా మీదా, అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీదా సెటైర్లు పడుతున్నాయనుకోండి.. అది వేరే విషయం.
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కించుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆ ఉత్సాహంతోనే, ఆ భరోసా వచ్చిన కారణంగానే రోజా ఈ మధ్య సెటైర్ల విషయంలో చెలరేగిపోతున్నారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొన్నామధ్య మహిళా దినోత్సవం నేపథ్యంలో రోజా ఇచ్చిన స్పీచ్ దగ్గర్నుంచి, ఆమె మాటల్లో వాడి వేడి రోజురోజుకీ జబర్దస్తుగా పెరిగిందనే చెప్పాలి. మంత్రి అయ్యాక రోజా ఇంకెంతలా చెలరేగిపోతారో ఏమో.!