2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకోలేని చంద్రబాబుపై కనీసం జాలి దయ అనేవి లేకుండా అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు ఒక రేంజు లో ఆడేసుకుంటున్నాడు. ఆ నేత ఈ నేత అని తేడా లేకుండా మైక్ అందుకున్న ప్రతి వైసీపీ నేత బాబుకు చుక్కలు చూపించటమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మంత్రులు బుగ్గన, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు మాత్రం ఒక రేంజు లో చంద్రన్న ను టార్గెట్ చేసుకొని విమర్శలు సంధిస్తున్నారు.
పోలవరానికి చంద్రబాబు ఏం చేశారనే విషయంపై నిన్న మంత్రి అనిల్ క్లియర్ పిక్చర్ చూపించగా.. మధ్యలో ముఖ్యమంత్రి జగన్, బాబు భజన ప్రహసనాన్ని చూపించి నవ్వులు పూయించారు.ఈరోజు కొడాలి నాని ”ఫేక్ కామెంట్ల”పై బాబుకి చుక్కలు చూపించారు. అసెంబ్లీ మొదలైన రోజు పోడియం ముందు చంద్రబాబు చేసిన ఓవర్ యాక్షన్ అందరూ చూశారు. అదే రోజు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన బాబు జగన్ పై నోరు జారారు. ఫేక్ సీఎం అంటూ శృతిమించి మాట్లాడారు.
సరైన సమయం కోసం చూస్తున్న కొడాలి నాని బాబుపై విరుచుకుపడ్డారు. 151మంది ఎమ్మెల్యేల బలం ఉన్న పార్టీ నాయకుడు, 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన ప్రజా నాయకుడిని ఫేక్ సీఎం అనడానికి బాబుకి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు నాని. అదే సమయంలో ఎవరు ఫేక్, ఎవరు రియల్ అనే విషయాన్ని సోదాహరణంగా వివరించారు. టీడీపీ పెట్టింది చంద్రబాబు కాదు, టీడీపీ అధినాయకుడిగా చంద్రబాబు న్యాయబద్ధంగా ఎన్నిక కాలేదు, చివరికి ముఖ్యమంత్రి పీఠంపై కూడా ఆయన న్యాయంగా కూర్చోలేదు. మామకి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు, దొడ్డిదారిన ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఫేక్ సీఎం, ఎవరు రియల్ సీఎం అని ప్రశ్నించారు నాని.
దీనికి ముందే ఆర్థిక మంత్రి బుగ్గన చంద్రబాబుకు పెద్ద క్లాస్ తీసుకున్నారు. భ్రమరావతి కేంద్రంగా బాబుకు చుక్కలు చూపించారు. నకిలీ పథకాల అమలు కోసం ఇతర రంగాల్ని ఎలా దెబ్బతీశారో లెక్కలతో సహా బయటపెట్టారు. మంత్రి అనీల్ కుమార్ చంద్రబాబు పరువు తీసి పడేశారు. పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి బాబు ఐదేళ్ల పాటు ఏం చేశారనే విషయాన్ని కూలంకుషంగా సభ ముందుంచారు. బాబు ముఖంలో నెత్తురు చుక్క లేకుండా చేశారు. వీరికి తోడు కురసాల కన్నబాబు, రోజా, అంబటి రాంబాబు లాంటి నేతలు కూడా బాబును టార్గెట్ చేసుకొని రెచ్చిపోయారు. వంతులు వారీగా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు పద్దతిగా బాబును ఆడేసుకున్నారు