వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి: జనసేన ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘వర్క్ ఫ్రమ్ హోం’ ముఖ్యమంత్రిగా అభివర్ణించింది జనసేన పార్టీ. భారీ వర్షాలు, వరదల కారణంగా కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైతే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితుల్ని ఆదుకోవడంలేదన్నది జనసేన ఆరోపణ.

రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, ముఖ్యమంత్రిని ఉద్దేశించి వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి అనడమే అస్సలేమాత్రం సబబుగా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు సిసలు ప్రతిపక్షం తామేనని చెప్పుకుంటున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వరద బాధితుల్ని ఆదుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగలేదు కదా.?

ఒకవేళ పవన్ కళ్యాణ్, ప్రజల్లోనే వుంటే.. ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాలేదు గనుక.. ‘వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి’ అంటే అది కొంత సబబుగా వుంటుందేమో. అసెంబ్లీ సమావేశాలు ఓ వైపు కొనసాగుతుండగా, మంత్రులు.. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోనే వుండి, బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం జనసేనకు తెలుసో లేదో.!

జనసేన, అధికార పార్టీ మీదా.. ప్రభుత్వం మీదా విమర్శలు చేయడం సంగతి పక్కన పెడితే.. జనసైనికులు మాత్రం తమ శక్తి మేర వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన నాయకులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

అధికార పార్టీ నేతలూ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి, అందరూ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తే.. బాధితులు త్వరగా కోలుకుంటారు.