కొందరు ఏదైన విషయంలో మునిగిపోతే పక్కన ఏం జరుగుతుందనే విషయం కూడా మరచిపోతారు. మనం ఎక్కడ ఉన్నాం, ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. కాని తాజాగా జరిగిన సంఘటన చూస్తే మనకు కాస్త ఆశ్చర్యం కలగడంతో పాటు ఆమె ఎంత అజాగ్రత్తగా ఉందనేది అర్దమవుతుంది. స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్ లో నివసిస్తున్న యూకే యువతి సోఫియా ఎల్లర్ తన ప్రియుడి పాట వింటూ తనని తాను మరచిపోయి నెత్తికి నిప్పంటించుకుంది.
మేటర్‌లోకి వెళితే సోఫియా ఎల్లర్ ప్రియుడు గిటారు వాయించుకుంటూ పాట పాడుతుంటే దానిని చక్కగా ఆస్వాదిస్తూ కూర్చుంది. తనని మరచిపోయి అటు ఇటూ ఊగుతూ ఉండగా, వెనుక ఉన్న క్యాండిల్ మంట సోఫియా జుట్టుకు అంటుకుంది. ఇంకేముంది మంట పాకిపోతున్న క్రమంలో అలర్ట్ అయిన సోఫియా ఆ మంటను ఆర్పేందుకు పరిగెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అయితే క్రిస్మస్ నేపథ్యంలో సోఫియా ఇంట్లో కొవ్వుత్తులను వెలిగించింది. ఇదే పెద్ద ప్రమాదానికి దారి తీసింది. అదృష్టవశాత్తు సోఫియా సేఫ్‌గా బయటపడడంతో ఈ వీడియో చూసిన వారందరు ఊపిరి పీల్చుకున్నారు.