పోలవరం టాపిక్ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతమున్న బడ్జెట్ మేరకు పోలవరం పూర్తిచేయటం కేంద్రం వలన కాదని, కేవలం ప్రాజెక్ట్ నిర్ణమాన వ్యయాన్ని మాత్రమే కేంద్రం ఇస్తుందని, నిర్వాసితుల నష్టపరిహారం లాంటివి మాకు సంబంధం లేదంటూ కేంద్రం ప్రకటించింది. దీనితో ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కు ఒక్కసారిగా షాక్ తగినట్లు అయ్యింది .
పోలవరం మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం 52 వేల కోట్లు , ఇప్పుడు కేంద్రం చెపుతున్న దాని ప్రకారం 22 వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పారు, దీనితో మిగిలిన 30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే అది సాధ్యంకాదని తెలుస్తుంది. గతంలో కేంద్రం ఇస్తామన్న ఆర్థిక ప్యాకేజి తీసుకోని రావటం చేతకాలేదనే మాటలు తమ మీద ఎక్కడ వస్తాయేమో అనే ఆలోచనతో అధికార వైసీపీ ఇందుకు ప్రధాన కారణం గత టీడీపీ ప్రభుత్వమే అంటూ వాళ్ళ మీద నింద వేస్తుంది. వాళ్లేమో జగన్ చేతకానితనం వలనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని విమర్శలు చేసుకుంటున్నారు.
రెండు ప్రధాన పార్టీలు తప్పు మీదంటే మీది అన్నట్లు మాటల దాడి చేసుకుంటుంటే ఎలాంటి లాభం లేదు. ఈ కొట్లాటను కేంద్రం సరదాగా చూస్తూ కాలం గడిపేస్తుంది, ఇప్పటికే పోలవరం నిర్మాణ వ్యయం రోజురోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దానిని పూర్తిచేయవల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంది , సాకులు చూపి తప్పించుకోవటం మంచి పద్దతి కాదు.
గొడవలు పడటం మానేసి దానికి బదులుగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, సీఎం అధ్యక్షతన పోలవరంపై తగిన నిర్ణయం తీసుకోని, అవసరం అయితే కేంద్రం మెడలు వంచి, మనకి ఇస్తామన్న నిధులను తీసుకొని రావాలి కానీ ఇలా తప్పు నీదంటే నీది అన్నట్లు గల్లీ పోరగాళ్ల మాదిరి పోట్లాటలు పెట్టుకుంటే నష్టపోయేది ఆంధ్ర ప్రజలు. పోలవరం అనేది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, కొన్ని కోట్ల మందికి జీవనాదారం, రాబోయే తరానికి ఊపిరిలూదే ప్రాణవాయువు అలాంటి పోలవరాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం వాడుకోవటం ముమ్మాటికీ తప్పే