ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అయ్యే ఛాన్సుందా.?

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అయ్యే అవకాశం వుందా.? లేదా.? అన్న అంశం చుట్టూ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? వివాద రహితుడాయన. కేంద్రమంత్రిగా పలుమార్లు పని చేశారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదన వెంకయ్యనాయుడిదే. కానీ, వెంకయ్యనాయుడి డిమాండ్ నెరవేరలేదు. బీజేపీ ప్రభుత్వం కూడా వెంకయ్యనాయుడిని ఈ విషయంలో గౌరవించలేకపోయింది.

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు తనవంతు కృషి చేశారన్నది బహిరంగ రహస్యమే. కానీ, ఆయన్ని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేసింది బీజేపీ అధినాయకత్వం. వెంకయ్యనాయుడిని ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టింది కమలదళం.

అయినాగానీ, ఉప రాష్ట్రపతి హోదాలో రాష్ట్రానికి ఏం చేయగలరో.. అంతకు మించే చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. మరిప్పుడు, ఆయనకు రాష్ట్రపతి పదవి వస్తే.? ఈ విషయమై సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవ్వాలనే ఆకాంక్షను బయటపెట్టారు చిరంజీవి. అయితే, తనకు పదవుల మీద వ్యామోహం లేదని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. తన మీద అభిమానంతో కొందరు అలా కోరడంలో తప్పేమీ లేదని కూడా వెంకయ్యనాయుడు చెప్పారు.

కానీ, రాష్ట్రపతి అవ్వాలనే కోరిక వెంకయ్యనాయుడికి వుండదని ఎలా అనుకోగలం.? దేశంలోనే అత్యున్నత పదవి అది. అయితే, బీజేపీ రాజకీయాలెలా వుంటాయో అందరికీ తెలిసిందే. రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు అన్ని విధాలా అర్హుడే. కానీ, ఆ అవకాశం ఆయనకు దక్కకపోవచ్చు.