‘పుష్ప’తో అల్లు అర్జున్ 100 కోట్లు కొల్లగొట్టగలడా.?

‘అల వైకుంటపురములో’ సినిమా నాటి పరిస్థితులకీ, ప్రస్తుత పరిస్థితులకీ స్పష్టమైన తేడా వుంది. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం అంత తేలిక కాదు. ఏ క్షణాన కరోనా పాండమిక్ పరిస్థితులు ఎలా మారిపోతాయో చెప్పలేం. పూర్తిగా కరోనా భయం తొలగిపోలేదు. పైగా, మూడో వేవ్.. అనే భయం ఇంకా వెంటాడుతూనే వుంది.

సినీ పరిశ్రమ కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బ తినేసింది. పెద్ద సినిమాల విడుదలలు ఆగిపోయాయి. డిసెంబర్ నుంచి ఎలాగోలా అసలు కథ మొదలయ్యే అవకాశం వుంది. ‘పుష్ప’ సినిమాతోనే జాతర షురూ అవుతుందన్న చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్. తొలి భాగం డిసెంబర్ 17న విడుదలవుతుంది. తొలి భాగంతోనే అల్లు అర్జున్ 150 కోట్ల మార్క్ దాటేస్తాడన్న నమ్మకం అల్లు అర్జున్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. 200 కోట్లు పక్కా.. అంటున్నారు బన్నీ అభిమానులు. మామూలుగా అయితే, ఆ అంచనాలు వుండడం సహజమే. కానీ, ఇప్పుడు కరోనా పాండమిక్ పరిస్థితుల్లో వున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల పంచాయితీ నడుస్తోంది.

మరి, ఇలాంటి గందరగోళ పరిస్థితుల నడుమ అల్లు అర్జున్ 100 కోట్లు అయినా కొల్లగొడతాడా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. అల్లు అర్జున్ స్టామినా.. 150 కోట్లకు పైనే చేరిందిప్పుడు. పరిస్థితులు అనుకూలిస్తే, ‘పుష్ప ది రైజ్’తో బన్నీ, బంపర్ హిట్ కొట్టే అవకాశముంది. ఆ పరిస్థితులే అనుకూలిస్తాయా.? లేదా.? అన్నది అసలు ప్రశ్న.