‘మా’ రగడ: ప్రకాష్ రాజ్ కొత్త కుంపటి పెట్టబోతున్నారా.?

ప్రకాష్ రాజ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి ఎందుకు రాజీనామా చేశారు.? నాగబాబు రాజీనామా వెనుక కారణమేంటి.? ప్రాంతీయత ప్రాతిపదికన జరిగిన ఎన్నికలు నిజానికి, అత్యంత అవమానకరమైనవి సినీ పరిశ్రమకు సంబంధించి. తెలుగు సినిమాల్లో తెలుగువారికంటే పరభాషా నటులు ఎక్కువగా కనిపిస్తుంటారు.

అసలు తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్ ఇటీవలి కాలంలో ఎప్పుడన్నా స్టార్‌డమ్ దక్కించుకుందా.? పోనీ, విలన్ల విషయంలో అయినా, మనోళ్ళు.. పరభాషా నటుల్ని డామినేట్ చేయగలుగుతున్నారా.? అలా జరగనప్పుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పేరుతో ప్రాంతీయతను తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సబబు.?

పైగా, ప్రకాష్ రాజ్ పరభాషా నటుడు కాబట్టే ‘మా’ ఎన్నికల్లో ఓడిపోయాడు.. అలా అతన్ని ఓడించేందుకు నడిచిన సినీ, రాజకీయ కుట్ర అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్, కొత్త కుంపటి కోసం ప్రయత్నిస్తున్నారట. హైద్రాబాద్ కేంద్రంగా త్వరలోనే కొత్త అసోసియేషన్ ప్రారంభించబోతున్నారట.

ఈ ‘అట’లో నిజమెంతోగానీ, ప్రకాష్ రాజ్‌కి మద్దతుగా వుంటానని నాగబాబు ఇప్పటికే ప్రకటించారు.. అయితే, అది కొత్త అసోసియేషన్ వ్యవహారమని స్పష్టతనివ్వలేదనుకోండి.. అది వేరే సంగతి. అమెరికాలో తెలుగు అసోసియేషన్లు బోల్డన్ని వున్నాయి. అక్కడా ఇలాంటి చెత్త రాజకీయాల వల్లనే అన్ని కొత్త అసోసియేషన్లు పుట్టుకొచ్చాయి.

సినీ పరిశ్రమలో అలాంటి అవకాశం వుంటుందా.? పరభాషా నటుడ్ని, ‘మా’ అధ్యక్షుడిగా ఒప్పుకోని కొన్ని శక్తులు, సినీ పరిశ్రమలోని నటుల కోసం కొత్త కుంపటి అంటే ఊరుకుంటారా.? వాళ్ళు ఊరుకున్నా, ఊరుకోకున్నా.. ప్రకాష్ రాజ్ తలచుకుంటే కొత్త కుంపటి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.

ప్రకాష్ రాజ్ పట్టు వదలని విక్రమార్కుడు.. సరే, రాజకీయంగా ఆయన భావజాలమేంటి.? అన్నది వేరే చర్చ. ‘మా’ ఎన్నికల విషయంలో, ఆయన తనకంటూ ఓ బలమైన ముద్ర వేశాడు.. ఓడిపోయినా. మరి, ఆయనే కొత్త కుంపటి పెడితే.. ఖచ్చితంగా అదో సంచలనమవుతుంది. ఇంతకీ కొత్త కుంపటికి ప్రకాష్ రాజ్ శ్రీకారం చుడతారా.? వేచి చూడాల్సిందే.