సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని రాజకీయ వేదికగా మార్చేసిన విషయం విదితమే. రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే, సినీ పరిశ్రమ సమస్యలపై ఆయన స్పందించిన తీరు పట్ల కనీసం మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా మద్దతిస్తారా.? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే వున్నారు సినీ హీరోలు. దాదాపుగా అందరూ యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.. రెండు డజన్లకు పైగానే ఈ కాంపౌండ్ నుంచి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాలున్నాయి. నటులు మాత్రమే కాదు, నిర్మాతలు కూడా వున్నారు మెగా కాంపౌండ్‌లో.
మరి, వీళ్ళలో ఎంతమంది పవన్ కళ్యాణ్ నిన్న ‘రిపబ్లిక్’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తారు.? పవన్ కళ్యాణ్‌కి అండగా నిలుస్తారు.? మెగాస్టార్ చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు గుప్పిస్తూ ఓ ట్వీట్ అయినా వస్తుందా.? బాబాయ్ కోసం ఏమైనా చేస్తామని చెప్పే చరణ్ నుంచి ఓ ట్వీట్ ఆశించగలమా.? అల్లు అర్జున్ ఈ వ్యవహారంపై స్పందించగలడా.? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. కొన్నాళ్ళ క్రితం పైరసీ విషయమై సూపర్ స్టార్ మహేష్ బాబు తరఫున పవన్ కళ్యాణ్ వకాల్తా పుచ్చుకున్నారు. మరి, మహేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థించగలడా.? నిఖిల్, నితిన్.. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు సినీ పరిశ్రమలో యంగ్ హీరోలుగా వున్నారు. వాళ్ళెవరి నుంచైనా మద్దతు పవన్ కళ్యాణ్ ఆశించగలరా.? ఇతరుల నుంచి సపోర్ట్ రావడం తర్వాత.. అసలంటూ మెగా కాంపౌండ్ నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు పొందాలి కదా.? అదే పవన్ కళ్యాణ్ ముందున్న అతి పెద్ద సవాల్ ప్రస్తుతానికి. లేదంటే, పవన్ గొంతు చించుకుని అరవడం అనేది ఓ వృధా ప్రయాసగా మిగిలిపోతుంది.