Jansenani : అన్నదమ్ములకి సొంత జిల్లా పశ్చిమగోదావరి అస్సలు కలిసి రాలేదు రాజకీయాల్లో. అందుకే, ఈసారి తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేశారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేనాని ఎన్నికల బరిలోకి దిగబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
మరోపక్క, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు కూడా వున్నాయట. గతంలోలానే రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చని తెలుగు మీడియాలో గుసగుసలు జోరందుకున్నాయి. ఇంతకీ, జనసేనాని వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.?
2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ అధినేతగా తిరుపతి అలాగే పాలకొల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. తిరుపతి నుంచి గెలిచినా, సొంత జిల్లా పశ్చిమగోగావరిలో ఓటమి పాలయ్యారు. పవన్ కళ్యాణ్ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన విషయం విదితమే. విశాఖ జిల్లా గాజువాకలోనూ ఆయనకు ఓటమి తప్పలేదు. మరోపక్క నాగబాబు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు.
సో, ఇప్పుడు ఈక్వేషన్ పశ్చిమ నుంచి తూర్పుకి మారుతోందా.? అన్న అనుమానాలకు కాస్తంత బలమైతే చేకూరుతోంది. కాగా, గాజువాక అలాగే భీమవరం నుంచే ఈసారి కూడా జనసేనాని పోటీ చేస్తారనీ, నాగబాబు కూడా నర్సాపురం నుంచే పోటీ చేయడానికి అవకాశాలున్నాయనీ ఇంకో వాదన బలంగా వినిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. సో, ఇప్పుడే ఈ స్పెక్యులేషన్స్.. అంటే అర్థం లేని వ్యవహారం. అయితే, ఎక్కడి నుంచి జనసేనాని పోటీ చేయాలన్న విషయమై జనసేన పార్టీ ముఖ్య నేతలు ఇప్పటినుంచే కసరత్తులు ముమ్మరం చేశారన్నది నిర్వివాదాంశం. ఇప్పటినుంచి లెక్కలు వేసుకుంటే, అప్పటికి ఓ అవగాహన సులువుగా రావొచ్చు.