ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తమిళనాడులో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్.. ఇద్దరూ తమ తొలి ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు. జనసేన పార్టీకి ఓ ఎమ్మెల్యే సీటు దక్కింది 2019 ఎన్నికల్లో. కానీ, మక్కల్ నీది మయ్యం పార్టీకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. పవన్ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. కమల్ ఒకే చోట పోటీ చేసి ఓడిపోయారు. పవన్, కమల్ మధ్య ఇంకో సారూప్యత వుంది. అదే, ఓటమి విషయంలో గందరగోళం. పవన్ గెలిచినట్లుగా ప్రచారం జరిగింది భీమవరం నియోజకవర్గంలో. కమల్ విషయంలోనూ అలాగే జరిగింది. కానీ, పవన్ ఓడిపోయారు.. కమల్ కూడా ఓడిపోయారు. కుట్రపూరితంగా కమల్ హాసన్ ఓటమి కోసం కొన్ని శక్తులు పనిచేశాయన్న ప్రచారం తమిళనాట గట్టిగా జరుగుతోంది. అదే ప్రచారం గతంలో పవన్ విషయంలోనూ జరిగింది. ఎందుకిలా.? అసలు కమల్ ఎందుకు ఓడిపోయారు.? అంటే, అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కటై కమల్ హాసన్ ఓటమి కోసం వ్యూహ రచన చేశాయన్న చర్చ తమిళనాడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
సేమ్ టు సేమ్ ఇలాంటి చర్చే ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనూ జరిగింది. ఇక, మక్కల్ నీది మయ్యం పార్టీ కూడా జనసేన పార్టీలానే ఎన్నికల్లో ఓట్ల కోసం అడ్డదారులు తొక్కలేదు. అసలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. అదే అక్కడ కమల్ ఓటమికి కారణం, ఇక్కడ పవన్ ఓటమికి కారణమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే, రాజకీయాల్లో అంతిమంగా గెలుపోటములే లెక్క. గెలిచారా.? ఓడారా.? అన్నదే ముఖ్యం. ఓటమి తర్వాత కూడా జనసేన అధినేత, పార్టీని నడపగలుగుతున్నారు. మరి, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఏం చేయబోతున్నారు.? ఓటమి వెనుక కారణాల్ని విశ్లేషించుకుని, రాజకీయాల్లో ముందడుగు వేస్తారా.? లేదంటే, పార్టీ జెండా పీకేస్తారా.? వేచి చూడాలి.