తెలుగు రత్నం ‘పింగళి’ ఎందుకు భారతరత్నం కాలేకపోయినట్టు.?

Pingali Venkayya

Pingali Venkayya

పింగళి వెంకయ్య.. తెలుగు జాతి రత్నం ఆయన. కాదు కాదు.. భారత జాతి రత్నం ఆ మహానుభావుడు. జాతీయ పతాక రూపశిల్పి మన తెలుగు నేల మీద జన్మించడం మనందరికీ గర్వకారణం. కానీ, ఏం లాభం.? జాతీయ జెండాని చూసి ఉప్పొంగిపోతాంగానీ, ఆ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్యును మాత్రం ‘భారతరత్న’ పురస్కారంతో ఇప్పటిదాకా గౌరవించుకోలేకపోయాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల్ని కలిశారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. అంతే కాదు, పింగళి కుటుంబానికి 75 లక్షల నజరానా ప్రకటించారు. అంతకు మించి ఇంకో గొప్ప పని చేశారు వైఎస్ జగన్. పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ప్రకటించాలంటూ ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ‘అమృత్ మహోత్సవ్’ పేరుతో దేశవ్యాప్తంగా నేటి నుంచి సంబరాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 75 వారాల పాటు ‘అమృత్ మహోత్సవ్’ పేరుతో సంబరాలు నిర్వహిస్తారు. ఈ సంబరాల వేళ, స్వాతంత్ర్య సమరయోధుల్ని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత. స్వాతంత్ర్యం.. అనగానే మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్.. ఇలా కొందరి పేర్లు మాత్రమే గుర్తు చేసుకునే మనం.. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనే మనకు తెలియని, మనకి తెలిసినా గుర్తు లేని చాలామంది మహనీయుల గురించి మళ్ళీ తెలుసుకునే అవకాశం కలుగుతుంటుంది. ఫలానా సినీ నటుడికి పద్మ పురస్కారమచ్చింది.. ఫలానా వ్యాపారవేత్తకూ పద్మ పురస్కారం లభించింది.. అని గొప్పగా చెప్పుకుంటుంటాం. అయితే గతంలోలా కాకుండా ఇటీవలి కాలంలో పద్మ పురస్కరాలు, మరింత గౌరవప్రదమైన వ్యక్తులకు దక్కుతుండడం అభినందించాల్సిన విషయమే. ఈ తరుణంలో, పింగళి వెంకయ్య.. మన జాతీయ పతాక రూపకర్తని భారతరత్న పురస్కారంతో గౌరవించుకోవడం మనందరి బాధ్యత. ఇన్నాళ్ళూ ఎందుకు ఆ పని చేయలేకపోయాం.? అన్న ప్రశ్నని పక్కన పెట్టి, వీలైనంత త్వరగా మన తెలుగు రత్నానికి భారతరత్న పురస్కారంతో గౌరవించుకునే దిశగా వడివడిగా అడుగులేద్దాం.