Dhanush and Aishwarya Divorce : భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు.? ఇద్దరూ కలిసి వుండలేమనే స్థాయికి ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చినప్పుడే విడిపోతారు భార్యాభర్తలు. ఇందులో వింతేమీ లేదు. సినీ సెలబ్రిటీలయినంతమాత్రాన, కలహాల కాపురాన్ని నెట్టుకురావాలన్న రూల్ ఏమన్నా వుంటుందా.? పైగా, హై లైఫ్ కేటగిరీలో ‘విడిపోవడం’ అన్నది చాలా చాలా సాధారణమైన విషయం. పైగా, ఈ మధ్య ఇలాంటి వ్యవహారాల తర్వాత సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి.
ఇప్పడిదంతా ఎందుకంటే, కోలీవుడ్ సినీ జంట ధనుష్, ఐశ్వర్య.. తమ పద్ధెనిమిదేళ్ళ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు నిన్ననే ప్రకటించేశారు. దాంతో, అసలు వీళ్ళెందుకు విడిపోయారో తెలుసా.? అంటూ కుప్పలు తెప్పలుగా కథనాలు షురూ అయ్యాయి. ధనుష్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడట.. ఐశ్వర్య ఇంకో వ్యక్తితో పెళ్ళికి సిద్ధమయ్యిందంట.. అంటూ చక్కర్లు కొడుతున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు.
మొన్నీమధ్యనే సమంత – నాగచైతన్య విడాకుల తర్వాత కూడా ఇలాంటి రూమర్స్ చాలానే వచ్చాయి. ‘కెరీర్ పరంగా మేమిద్దరం విడివిడిగా చాలా హ్యాపీ..’ అనేశాడు నాగచైతన్య, విడాకులపై స్పందిస్తూ.. అదీ చాలా సింపుల్‌గా తేల్చేశాడు. సమంత మాత్రం, సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన కామెంట్లు పోస్ట్ చేస్తూ వుందనుకోండి.. అది వేరే సంగతి.
ధనుష్ – ఐశ్వర్య ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఐశ్వర్య స్వయానా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె. వీరిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. ఎంత అన్యోన్య దాంపత్యమైనా కాపురం అన్నాక చిన్నా చితకా అభిప్రాయ బేధాలు సహజమే కదా. అలా ఏ చిన్న అభిప్రాయ బేధమో, విడాకుల వరకు దారి తీసి వుండొచ్చు. అద్గదీ అసలు సంగతి. కానీ, మీడియాలో జరుగుతున్న రచ్చ వేరు.