ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళదామనుకున్నారు.. కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాల్ని తీసుకెళ్ళాలనుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్‌మెంట్లు దొరకలేదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. కరోనా నేపథ్యంలో కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు దొరకడం గగనంగా మారిపోయిందన్నది ఓ వాదన.
ఇంకో వాదన అంటేంటే, ఇటీవల వ్యాక్సినేషన్ విషయమై కేంద్రానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయడంతో, కేంద్ర ప్రభుత్వ పెద్దలు గుస్సా అయ్యారనీ, ఈ నేపథ్యంలోనే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనీ అంటున్నారు. అసలు ఇలా జరిగే అవకాశం వుందా.? ముఖ్యమంత్రి కోరితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వుండరు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అపాయింట్‌మెంట్ కాస్త ఆలస్యం అవ్వొచ్చు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో అదే జరిగి వుండొచ్చు. కొద్ది రోజుల్లో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్ళడం ఖాయం. మూడు రాజధానులు, వ్యాక్సినేషన్, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు సహా అనేక అంశాలపై ఢిల్లీ పెద్దలతో ఏం మాట్లాడాలన్న మేటర్ ఇప్పటికే సిద్ధంగా వుంది ముఖ్యమంత్రి దగ్గర. సంబంధిత సమాచారాన్ని ముందుగానే కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం చేరవేసి వుండొచ్చు కూడా. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా కేంద్రం, అపాయింట్‌మెంట్లు ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అంటే, గడచిన ఏడేళ్ళ నుంచీ రాష్ట్రాల పట్ల కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్న మాట వాస్తవం. గతంలో చంద్రబాబు విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు వైఎస్ జగన్ విషయంలోనూ అదే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏమో, ఈ వాదనల్లో నిజమెంతోగానీ, రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన స్థాయిలో సాయం చెయ్యలేకపోతోందన్నది నిర్వివాదాంశం.
ఇక, ముఖ్యమంత్రిని అవమానించడమంటారా.? అదొక పరమ రొటీన్ వ్యవహారమైపోయిందన్న విమర్శలు లేకపోలేదు.