జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాను తిరిగి సినిమాల్లో నటించడం గురించి పదే పదే వివరణ ఇచ్చుకుంటున్నారు. ‘నేనెందుకు సినిమాలు చేయకూడదు.?’ అని ప్రశ్నిస్తున్నారాయన. ఔను, నిజమే.. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే, ఎవరికి రాజకీయంగా ఇబ్బంది వుంటుంది.? ఎవరికీ వుండదు.
సినీ నటి రోజా, సినిమాలు చేయకపోయినా.. రాజకీయాల్లో వుంటూనే, బుల్లితెరపై కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గానూ ఆమె బాద్యతలు నిర్వహిస్తున్నారు. అసలు సమస్య అది కాదు. ‘పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తాను. సినిమాలు వదిలేస్తున్నాను..’ అని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించుకున్నారు. అదే అసలు సమస్య. అంతే కాదు, ‘మీరు బాగా పరిపాలించండి.. నేను రాజకీయాలు వదిలేసి, సినిమాలు చేసుకుంటాను..’ అని కూడా ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అదే సమస్య. రాజకీయాల్లో ప్రతి మాటకీ అట్నుంచి కౌంటర్ గట్టిగానే వుంటుంది. ‘అప్పుడు సినిమాలు మానేస్తానన్నారు కదా.. ఇప్పెడెందుకు చేస్తున్నారు.?’, ‘మీరు మళ్ళీ సినిమాల్లోకి వెళ్లడమంటే వైఎస్ జగన్ పాలన బాగుందనే కదా అర్థం.?’ అంటూ పవన్ కళ్యాణ్‌పైకి ప్రశ్నలు దూసుకొస్తాయే తప్ప, పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదని ఎవరైనా అనగలరా.? అవకాశమే లేదు.
నిజమే, రాజకీయ నాయకులు వ్యాపారాలు చెయ్యకూడదు. సేవ చేస్తామని రాజకీయాల్లోకొచ్చి, వ్యాపారం చేయడం నైతికత ఎలా అవుతుంది.? ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. కానీ, రాజకీయాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారం. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు, లక్షన్నరో రెండు లక్షలో వేతనం వచ్చే పదవి కాదు ఎమ్మెల్యే అంటే. అంతకు మించి. కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలయ్యేది కేవలం లక్షల రూపాయల వేతనం కోసం కాదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవించాల్సిందే.. ఆయన ఆలోచనలతో గొంతు కలపాల్సిందే.