Mohanbabu : లేఖలు సరే, మోహన్‌బాబు చేతల్లోకి దిగేదెప్పుడు.?

Mohanbabu : సీనియర్ నటుడు, నిర్మాత, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు విడుదల చేసిన బహిరంగ లేఖ అందర్నీ విస్మయానికి గురిచేసింది. 47 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నమాట.. అందరి జీవితాలతో ముడిపడిన సినిమా ఇండస్ట్రీ గురించి.. అంటూ ఆ లేఖలో పలు అంశాల్ని మోహన్‌బాబు ప్రస్తావించారు.

నటుడిగా, నిర్మాతగా బోల్డంత అనుభవం వున్న మోహన్‌బాబు ‘పెద్దమనిషి’ హోదాలో, తెలుగు సినీ పరిశ్రమకు ఓ అప్పీల్ చేయడాన్ని స్వాగతించాల్సిందే. సమస్యల విషయమై పరిశ్రమలో అంతా ఒక్కతాటిపైకి వచ్చి, చర్చించుకుని, ఆ విషయాల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలన్నది మోహన్‌బాబు సూచన.

అయితే, ఈ ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి కూడా. ఇక్కడ, పరిశ్రమ ఏకతాటిపైకి రావడం, రాకపోవడం అన్నది సమస్య కాదు. తెలంగాణ ప్రభుత్వం, సినీ పరిశ్రమ బాగు కోసం ముందుకొచ్చింది. మరి, ఆంద్రప్రదేశ్ సంగతేంటి.?

‘మాకు మీ వల్ల ఉపయోగమేంటి.? మీరు హైద్రాబాద్‌లో వుంటారు.. అక్కడే పన్నులు కడతారు. ఆంధ్రప్రదేశ్‌లో షూటింగులు కూడా చెయ్యరు.. మీరేమో కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటారు..’ అంటూ సినీ పరిశ్రమపై కొందరు ఆంధ్రప్రదేశ్ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఓ సీని నటుడిగా, నిర్మాతగా మోహన్‌బాబు ఈ విషయమై స్పందించి వుండాల్సింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చి, ఆ పార్టీ నేతగా ఇప్పటికీ చెలామణీ అవుతున్న మోహన్‌బాబు, ఏపీలో అధికారంలో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పరిశ్రమ సమస్యలపై చర్చించి వుంటే బావుండేదేమో.

అయ్యిందేదో అయిపోయింది. పరిశ్రమకి ‘పెద్ద దిక్కు’ లేకుండా పోయిందన్న పరిస్థితుల్లో చిరంజీవిని పెద్ద మనిషిగా నిల్చోబెట్టి, ఆయన ద్వారా సమస్యల పరిష్కారం కోసం కొందరు సినీ ప్రముఖులు గతంలో ప్రయత్నించారు, ఆ ప్రయత్నాలు కొంత సఫలమయ్యాయి. ‘నేను పెద్దరికం తీసుకోవాలనుకోవడంలేదు..’ అని చిరంజీవి చెప్పిన దరిమిలా, ఆ పెద్దరికమేదో మోహన్‌బాబు తీసుకుని, పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అంతకన్నా కావాల్సిందేముంది.?