Corona Virus: కరోనా వైరస్ (కోవిడ్ 19) వెలుగు చూసి దాదాపు ఏడాదిన్నర గడుస్తోంది. ప్రపంచంలో చాలా దేశాలు కరోనా దెబ్బకి విలవిల్లాడాయి, విలవిల్లాడుతూనే వున్నాయి. ‘హమ్మయ్య.. ప్రస్తుతానికి మేం బాగానే వున్నాం..’ అని ఏ దేశమూ కాస్తంత స్థిమితపడటానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, ఎప్పుడు ఏ కొత్త మ్యుటెంట్ ఎలా వ్యాప్తి చెందుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. మన దేశంలోనూ కరోనా మొదటి వేవ్ ముగుస్తున్న సమయంలో.. ఆల్ ఈజ్ వెల్.. అని అంతా అనుకున్నారు. కానీ, అంతలోనే మళ్ళీ సెకెండ్ వేవ్ విరుచుకుపడింది.. ఈ దెబ్బకి దేశం తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోన్న విషయం విదితమే.
అసలు కరోనా వైరస్ గురించి మనకేం తెలుసు.? అని ఆత్మవిమర్శ చేసుకుంటే, చాలా విషయాలు తెలియవనే చెప్పాలి. కరోనా వైరస్ గాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది.? మాస్క్ పెట్టుకుంటే ఎంత మేర రక్షణ కలుగుతుంది.? అసలు కరోనా సోకకుండా వుండాలంటే ఏం చేయాలి.? ఇలాంటి అంశాలపై మనకి పూర్తి అవగాహన లేదు. ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాల్ని విడుదల చేస్తున్నాయ్.. అయితే, అవి ఎప్పటికప్పుడు మారిపోతున్నాయ్. వైద్యులు ఒక్కోసారి ఒక్కోలా చెబుతున్నారు. ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు పెట్టుకుంటే ఎక్కువ రక్షణ.. అని తాజాగా చెబుతున్నారు.
చిన్న పిల్లల్లో ఎక్కువ ప్రభావం లేదని మొదట అన్నారు. ఇప్పుడు చిన్న పిల్లలూ జాగ్రత్త.. అంటున్నారు. యువతకు పెద్దగా ప్రమాదం లేదని గతంలో చెప్పారు. కానీ, ఇప్పుడు యువత కూడా ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఏ మందులు వేసుకోవాలి.? ఏ ఇంజెక్షన్ ఎప్పుడు వినియోగించాలి.? వంటి అంశాలపైనా రోజుకో కొత్త వాదన తెరపైకొస్తోంది. మనిషి శాస్త సాంకేతిక రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధించేశాడనీ, అందునా.. వైద్య శాస్త్రంలో చాలా ఎదిగిపోయాడనీ.. మనం చెప్పుకుంటున్నాం. కానీ, ఏడాదిన్నర గడుస్తున్నా.. ఇంతవరకు కరోనా వైరస్ మీద పోరాటం కోసం సరైన మెడిసిన్ కనుగొనలేకపోయాం.