తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్ని లక్షల మంది అభిమానులకి షాక్ ఇస్తూ రాజకీయాల్లోకి అరంగేట్రం ఇవ్వకముందే డోర్స్ క్లోజ్ చేస్తునట్టు ప్రకటించారు. ఆరోగ్య సమస్యల కారణంగా ప్రజలకి రాజకీయాల్లోకి వచ్చి కాకుండా , ఇతర రూపంలోనే సేవ చేస్తాను అంటూ పొలిటికల్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటికే 70వ పడిలో ఉన్న రజినీ భవిష్యత్తులోనూ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేనట్లే.
ఆయన పొలిటికల్ కెరీర్ మొదలు కాకుండానే ముగిసిపోయిందన్నమాట.
రజినీ నిర్ణయాన్ని కొందరు అభిమానులు అర్థం చేసుకున్నప్పటికీ.. కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రజినీ ఇంటి ముందు కొందరు అభిమానులు ఆందోళన కూడా చేస్తున్నారు. కాగా రజినీకి దగ్గరి మిత్రుడు.. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగు పెట్టి పార్టీని నడిపిస్తున్న కమల్ హాసన్ రజినీ నిర్ణయంపై స్పందించాడు. రజినీకాంత్ ప్రకటనపై ఆయన అభిమానుల్లాగే తాను కూడా నిరాశ చెందానని అన్న కమల్ హాసన్ తన మిత్రుడి ఆరోగ్యమే తనకు అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశాడు.
ఇప్పుడు రజినీని తాను కలవబోనని.. ఎన్నికల ప్రచారం తర్వాత తన మిత్రుడిని కలుస్తానని కమల్ తెలిపాడు. కమల్ అన్నట్లుగా రజినీ ఆరోగ్యం దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదన్నది ఆయన శ్రేయోభిలాషుల మాట. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేసుకున్న రజినీ.. ప్రస్తుత కరోనా టైంలో రాజకీయాల కోసం బయట తిరిగితే ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చన్నది సన్నిహితుల ఆందోళన. దీనితో అయన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి రావడం మంచిది కాదు అనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.