నిజామాబాద్ జిల్లా అంటేనే గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటివి. అలాంటి పార్టీ నేడు ఉనికినే కాపాడుకోలేని స్థితికి చేరుకొని పార్టీ ఆఫీస్ కి తాళలేసుకునే పరిస్థితి దాపురించింది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నాటికే అక్కడ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఆ ఎన్నికల్లో కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఏకంగా డిపాజిట్లు కోల్పోయింది. ఇక మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత ప్రజా ప్రతినిధులను కాపాడుకోలేక దారుణమైన ఓటమి చూసింది.
143 మంది ఉంటే కేవలం 29 మంది మాత్రమే కాంగ్రెస్ కు ఓట్లు వేశారంటే అక్కడి పరిస్థితి ఏమిటో ఆలోచించండి. నిజామాబాదు లో సీనియర్ నేతలైన మాజీ మంత్రలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి , మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ లాంటి సీనియర్ నేతలు, జూనియర్ నేతలు మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. కనీసం వాళ్ళ జాడ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. దీనితో మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరింత అద్వానంగా మారిపోయింది. పైగా యాక్టీవ్ గా ఉండే కొద్దిపాటి నేతలు మధ్య కూడా వర్గ పోరుతో మిగిలిన ఓటు బ్యాంకు కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పార్టీని నడిపించే సరైన నాయకుడు ఎవరు కనిపించటం లేదు. ఎవరికీ వాళ్ళు తమ సొంత పనులు చూసుకోవటం తప్పితే పార్టీని పెద్దగా పట్టించుకోవటం లేదు. పార్టీ పరంగా చురుగ్గా ఉంటే ఎక్కడ అధికార తెరాస పార్టీ తమను టార్గెట్ చేస్తారేమో అనే భయం కూడా అక్కడి సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఉన్నట్లు సమాచారం. ఇలా అనేక కారణాలు వలన నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తన దుకాణాన్ని మూసేసుకునే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట.. మరి కొత్తగా తెలంగాణ ఇంచార్జి పదవి చేపట్టిన మాణికం టాగూర్ ఈ జిల్లా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోని, పార్టీని గాడిలో పెడుతాడో వేసిచూడాలి.. ఇదే సమయంలో ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి బీజేపీ పార్టీ తగిన కసరత్తులు చేస్తుందని తెలుస్తుంది.