ఆంధ్ర్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము విర్రాజును అదిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణ ను తప్పించి సోముని బీజేపీ నియమించింది. మూడు రాజధానుల బిల్లు విషయంలో కన్నా లక్ష్మీనారాయణ అదిష్టానాన్ని సంప్రదించకుండా లేఖ రాయడం ఎంత మాత్రం ఇష్టం లేకనే వేటు వేసింది అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. అయితే కన్నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే మళ్లీ బీజేపీ ఏపీలో రంగంలోకి దించింది. వైకాపా, టీడీపీ పార్టీలు బీసీ సామాజిక వర్గాన్ని వెంటేసుకుని రాజకీయం చేస్తోన్న నేపథ్యంలో బీజేపీ కాపు సామాజిక వర్గానికి ఏపీలో పెద్ద పీట వేసి ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీతో జత కట్టారు అన్నది మరో వైపు వాదన ఉంది. తాజాగా సోము విర్రాజు గురుంచి జనసేనాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వీర్రాజుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్ధి ఉద్యమాల నుంచి వచ్చిన వీర్రాజుకు క్షేత్ర స్థాయిలో పేదల సమస్యలపై అవగాహన ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా అపార అనుభవం ఉన్న నాయకుడన్నారు. నాయకత్వ లక్షణాలు చిన్న వయసులోనే అలవడ్డాయన్నారు. వీర్రాజు నాయకత్వంలో బీజేపీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రజా సమస్యలపై కొత్త సారథితో కలిసి పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నామన్నారు.
అయితే పాత సారథిని తొలగించడంపై మాత్రం పవన్ స్పందించలేదు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసేన ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు కన్నాతో కలిసి పవన్ పనిచేసారు. రాష్ర్ట రాజకీయాలపై, ప్రభుత్వ పథకాలపై ఇరువురు కలిసి పోరాటం చేసారు. కన్నా కూడా పవన్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆ ఇద్దరి మధ్య బాండింగ్ మరింత స్ర్టాంగ్ అయింది. జగన్ ఏడాది పాలన సహా మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా గట్టగానే స్వరం వినిపంచారు. మరి సోము వీర్రాజు తో పవన్ ప్రయాణం ఎలా ఉంటుందన్నది చూడాలి.