అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఇండస్ట్రీలో పుకార్లకు కొదవే ఉండదు. స్టార్ హీరోల అభిమానుల్ని టార్గెట్ చేసుకుని తరచూ ఏదో ఒక గాలి వార్తను పుట్టిస్తుంటారు కొందరు. దాన్ని పట్టుకుని హీరోల అభిమానులు నానా హడావుడి చేయడం, చివరకు అది ఫేక్ వార్తని తెలిసి నీరసపడిపోవడం కామన్. ప్రస్తుతం అలాంటి వార్తే ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో మల్టీస్టారర్ చేయనున్నారనే వార్త. తారక్, విజయ్ ఇద్దరూ కలిసి పనిచేస్తే మంచి విషయమే. కానీ ఈ వార్తల్లో విశ్వసనీయత ఎంత అనేదే పెద్ద ప్రశ్న.
విజయ్, తారక్ ఇద్దరి క్యాలెండర్స్ పూర్తిగా నిండి ఉన్నాయి. ఇంకో రెండుమూడేళ్లు ఇద్దరూ ఖాళీగా ఉండరనేది మాత్రం పక్కా. విజయ్ ప్రజెంట్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. అది పూర్తవగానే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే సినిమా ఉంటుందని అంటున్నారు. దాని తర్వాత కూడ ఇంకో ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తారక్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ పూర్తవగానే కొరటాల శివతో వర్క్ చేస్తాడు. అది కాగానే ప్రశాంత్ నీల్ లేదా బుచ్చిబాబుతో చేస్తారు. ముందు వెనక అయినా వీరిద్దరి సినిమాలు మాత్రం ఖాయం. ఈ లెక్కన ఇరువురు హీరోలు ఫ్రీ అవ్వాలంటే ఇంకో రెండేళ్లు ఈజీగా పడుతుంది.
ఇక మల్టీస్టారర్ డైరెక్ట్ చేస్తాడని చెబుతున్న అట్లీ కూడ ఖాళీగా ఏం లేదు. అతనూ ఫుల్ బిజీ. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ లెక్కన విజయ్, తారక్ మల్టీస్టారర్ అనేది నమ్మశక్యం కాని వార్తలానే ఉంది. పైపెచ్చు నమ్మకమైన వ్యక్తులు ఎవ్వరూ కూడ ఈ అంశం మీద మాట్లాడట్లేదు. అన్నింటినీ మించి తెలుగు, తమిళ స్టార్ హీరోల కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేది బిగ్ క్వశ్చన్. సో.. ఫ్యాన్స్ మాత్రం విజయ్-తారక్ కాంబినేషన్ మీద హోప్స్ పెట్టుకోకపోవడమే మంచిది.