ఏపీ సీఎం జగన్ నిర్ణయాలు ప్రధానమైన సామాజికవర్గంలో చర్చనీయాంశమైంది. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. పదవులన్నీ ఇతర సామాజికవర్గాలకు కేటాయిస్తుండంతో రెడ్డి సామాజిక వర్గం నేతలు తప్పు పడుతున్నారు. నేరుగా బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినా సీనియర్ నేతల ఎదుట తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు జగన్ కు అవసరం లేదా, అని వారు నిలదీస్తున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులన్నీ 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే కేటాయిస్తున్నారు. వారికి ఇస్తున్న ప్రాధాన్యత పార్టీని ఆర్థికంగా, సామాజికపరంగా ఆదుకున్న తమకు ఇవ్వడం లేదన్నది రెడ్డి సామాజికవర్గం ఆందోళన.
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భర్తీ చేసిన పదవుల్లో తమకు కేటాయించడం లేదని, భవిష్యత్ లోనూ ఆ అవకాశం లేనట్లే కన్పిస్తుందంటున్నారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని ఢీకొట్టేందుకు జగన్ వెంట రెడ్డి సామాజికవర్గం నడిచింది. ఎనిమిదేళ్ల పాటు పార్టీని పెట్టి అష్టకష్టాలుపడిన జగన్ కు అండగా నిలిచింది. ఉదాహరణకు శాసనమండలిలో ఖాళీ అవుతున్న పదవులన్నీ ఇతర సామాజికవర్గాలకే కేటాయిస్తుండటం రెడ్డి సామాజికవర్గంలో ఆందోళన నెలకొంది. జగన్ తొలిసారి అధికారంలోకి రావడంతో వీరంతా ఆశలు పెంచుకున్నారు.
శానసమండలిలో ఇప్పటి వరకూ భర్తీ చేసిన పదవులన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే జగన్ కేటాయించారు. మైనారిటీ కోటా కింద మహ్మద్ ఇక్బాల్, జకియా ఖాన్, కరీమున్నీసాలకు అవకాశం ఇచ్చారు. ఇక ఎస్సీ కోటా కింద బలి కల్యాణ చక్రవర్తి, పండుల రవీంద్ర బాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ లకు అవకాశం ఇచ్చారు. ఇక రెడ్డి సామాజికవర్గం కింద ఒక్క చల్లా భగీరధరెడ్డికే ఛాన్స్ ఇచ్చారు. రానున్న ఎమ్మెల్సీ పదవులు కూడా జగన్ వేరే సామాజికవర్గాల వారికే ఇవ్వాలని నిర్ణయించడం వీరిలో అసహనం వ్యక్తమవుతోంది. నేరుగా జగన్ ను కలసి తమ అసంతృప్తిని తెలియజేయాలని నిర్ణయించారు.