RRR : ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. వీలైతే పది సార్లు, పాతిక సార్లు కూడా ఓ సినిమాని చూసే వీరాభిమానులు వుంటారు. వందల సార్లు సినిమా చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనే కోరిక అరివీర భయంకరమైన అభిమానులు కొందరికి వుండొచ్చుగాక.
కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ సినిమాని థియేటర్‌కి వెళ్ళి ఓ సారి చూడటమే కష్టం. ఎందుకంటే, సినిమా అంటే అంత ఖరీదైన వ్యవహారమైపోయింది. అందునా, తొలి నాలుగైదు రోజుల్లో లేదా తొలి వారంలో సినిమా చూడటమంటే అది గగనమే.
పైగా, ఇప్పుడు రేట్లు ఇంకా పెరిగిపోయాయ్. ప్రత్యేకంగా ప్రభుత్వాలు వెసులుబాట్లు పెంచుకుని అదనంగా టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా అయితేనేం, ఇంకో సినిమా అయితేనేం.! ఓ కుటుంబం.. అంటే, నలుగురు వ్యక్తులు వెయ్యి నుంచి రెండు వేలు ఆ పైన ఖర్చు చేసి ఓ సారి సినిమా చూడటమే కష్టం. అలాంటిది, నాలుగు సార్లు చూడాలంటే అంతే సంగతులు.
దర్శకుడు సందీప్ వంగా మాత్రం, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ కోసం, ఇంటర్వెల్ సీన్ కోసం.. ఇలా మొత్తంగా సినిమాని నాలుగు సార్లు చూడాలని చెబుతున్నాడట. ఆల్రెడీ రెండు సార్లు ఇప్పటికే చూసేసి, మూడోసారి చూస్తున్నానంటూ సోసల్ మీడయాలో పేర్కొన్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ కదా.! ఆ మాత్రం ఫైర్ వుంటుంది. మీకంటే కుదురుతుంది. అందరికీ అలా కుదరదు కదండీ.!