వాల్ట్ డిస్నీ కంపెనీ తెలుసు కదా. అతి పెద్ద ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ అది. ఆ కంపెనీకే ప్రస్తుతం గడ్డుకాలం వచ్చింది. కరోనా వల్ల ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయింది. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా కుప్పకూలిపోయాయి. ఇప్పటికే కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. చిన్నచిన్న కంపెనీలు, స్టార్టప్ ల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా.. వాల్ట్ డిస్నీ కూడా భారీగా ఉద్యోగాల్లో కోతను విధించింది. ఉద్యోగులను తీసేయడం తప్ప మరోమార్గం లేదని చెప్పిన కంపెనీ… థీమ్ పార్క్ లో పనిచేస్తున్న 28 వేల మందికి ఉద్వాసన పలికింది.
వాల్ట్ డిస్నీలో ఉన్న ఉద్యోగుల్లో నాలుగో వంతు ఉద్యోగులను తీసేశారు. అందులో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులేనని.. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని నెలల పాటు కంపెనీని నెట్టుకొచ్చామని.. ఇక కోత విధించడం తప్పడం లేదంటూ… డిస్నీ పార్క్ చైర్మన్ జోష్ అమారో స్పష్టం చేశారు.
కంపెనీ తన ఖర్చులను తగ్గించుకునేందుకు ఎయిర్ లైన్స్ గ్రూప్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నా.. కంపెనీ నష్టాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతుండటంతో వాల్డ్ డిస్నీ ఈ పని చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.