Pushpa : ఓ సినిమా తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలెంత కష్టపడాలి.? నటీనటులెంత కమిట్మెంట్ ప్రదర్శించాలి.? ఈ రోజుల్లో సినిమా తెరకెక్కించడం ఓ లెక్క.. దాన్ని విడుదల చేయడం ఇంకో లెక్క. పబ్లిసిటీ విషయంలోనూ బోల్డన్ని కష్టాలుంటాయ్. కానీ, అభిమానులకి అవేవీ కనిపించవు. చెప్పిన సమయానికి చెప్పినట్టు జరిగిపోవాలంతే.
ఈ మధ్య ప్రతి నిర్మాణ సంస్థకీ అభిమానుల నుంచీ తలనొప్పి సర్వసాధారణమైపోయింది. ఏదన్నా సినిమా ప్రమోషన్ కోసం ‘డేట్’ అనౌన్స్ అయ్యిందంటే, చెప్పిన సమయానికి అన్నీ జరిగిపోవాలంతే.! లేదంటే, అభిమానులు తిట్టే తిట్లకి సదరు నిర్మాణ సంస్థకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
తాజాగా, ‘పుష్ప’ సినిమా విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది అభిమానుల నుంచి. ‘పుష్ప’ ట్రైలర్ విషయంలో ఆలస్యం జరిగింది. అంతే, వందలాది, వేలాది బూతులు సోషల్ మీడియా వేదికగా మైత్రీ మూవీ మేకర్స్ మీదకి దూసుకొచ్చాయి.
సాంకేతిక సమస్యలతో సినిమా ప్రోమోస్ చెప్పిన సమయానికి రావడంలేదు. అయితే, దీన్ని అభిమానులు పబ్లిసిటీ స్టంట్స్ తరహాలో చూస్తున్నారు. అదే అసలు సమస్య. ఇక్కడ, అభిమానులు ఇంతలా గుస్సా అవడానికీ బలమైన కారణం లేకపోలేదు. పుష్ప ట్రైలర్ విషయంలో ‘ట్రెండింగ్’ మీద బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
ఇంకా షాకింగ్ విషయమేంటంటే, కొందరు డై హార్డ్ అభిమానులైతే, సొంత ఖర్చులతో ట్రెండింగ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అదీ అసలు సమస్య. చెప్పిన సమయానికి ట్రైలర్ రాకపోవడంతో, పెద్దయెత్తున నష్టపోయామన్న భావనలో అల్లు అర్జున్ అభిమానులు కొందరున్నారు. అదీ సంగతి.
ఇక, ట్రైలర్ కాస్త లేటుగా అయినా.. లేటెస్టుగా వచ్చేయడంతో.. అప్పటిదాకా మంటమీదున్న అభిమానులు, కూల్ అయిపోయారు.. ట్రెండింగ్ వ్యవహారాల్లో బిజీగా మారిపోయారు.