2015 నాటి ఓటుకు నోటు కేసులో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీటుని దాఖలు చేసింది. ఉమ్మడి ఆంధ్రపదేశ్ రెండుగా విడిపోయాక ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైతే, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇద్దరి మధ్యా రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకోసం అప్పటి టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ని డబ్బుతో తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించారన్నది ప్రధాన అభియోగం.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ‘రెడ్ హ్యాండెడ్’గా తెలంగాణ ఏసీబీకి చిక్కారు. ఈ కుట్రలో వేం నరేందర్ రెడ్డి, సండ్ర వీరయ్య తదితరులూ ఆరోపణలు, విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి, సండ్ర వీరయ్య.. ఇప్పుడు టీడీపీలో లేరు. సండ్ర వీరయ్య తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. పార్టీ ఫిరాయింపులు, బలవంతపు మార్పిడుల వ్యవహారం నేపథ్యంలో ఓటుకు నోటు కేసు తెరపైకొచ్చిందన్నది బహిరంగ రహస్యం. కాగా, ఈ కేసులో చంద్రబాబు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తెరవెనుకాల నడిపించింది చంద్రబాబేనని అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆరోపించారు. ‘చంద్రబాబుని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..’ అంటూ కేసీఆర్, రాజకీయ సవాళ్ళు విసిరితే, ‘నీకూ ఏసీబీ వుంది.. నాకూ సీఐడీ వుంది..’ అంటూ చంద్రబాబు, ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో అప్పట్లో ఓటుకు నోటు కేసు డైల్యూట్ అయిపోయిందనే విమర్శలున్నాయి. వీడియో ఫుటేజీలు, వాయిస్ రికార్డింగులు.. ఇలా పెద్ద కథే నడిచింది. ఇంతకీ ఈ కేసులో చంద్రబాబు ఇరుక్కుంటారా.? రేవంత్ పరిస్థితి ఏమవుతుంది.? ఈడీ చార్జిషీటు నేపథ్యంలో ప్రముఖ రాజకీయ నాయకుల తలరాతలు తిరగబడతాయంటూ జరుగుతన్న ప్రచారంలో నిజమెంత.? వేచి చూడాల్సిందే.