విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వేగంగా ఆ పని పూర్తి చేసేందుకు తగిన చర్యలు కూడా చేపడుతోంది. ఓ పక్క ఇంత వేగంగా అన్ని వ్యవహారాలూ నడిచిపోతోంటే, కేంద్రంలో తామే అధికారంలో వున్నామని తెలిసీ, ఏపీ బీజేపీ నేతలు వింత నాటకానికి తెరలేపారు.
విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను ఆపుతామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అమరావతి విషయంలో ఏపీ బీజేపీ వైఖరి ఒకలా వుంటే, ఢిల్లీ బీజేపీ పెద్దల వైఖరి ఇంకోలా కనిపిస్తోంది. అసలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్రం గుర్తించడంలేదంటే దానర్థమేంటి.? ఈమాత్రం ఇంగితం లేకుండా ఏపీ బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కేంద్ర మంత్రి పదవి కూడా తెచ్చుకోలేని అసమర్థత ఏపీ బీజేపీ నాయకత్వానిది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలకూ కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యత లభించింది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్ప. సరే, ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఏమాత్రం సిగ్గుపడటంలేదనుకోండి.. అది వేరే సంగతి.
ప్రైవేటీకరణతో నష్టమేమీ లేదని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కొందరు ఏపీ బీజేపీ నేతలే నిన్న మొన్నటిదాకా మాట్లాడారు. ఇప్పుడేమో, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అసలు ప్రైవేటీకరణ జరగదంటున్నారు. కానీ, కేంద్రం మాత్రం, స్టీలు ప్లాంటు ఆస్తుల విలువలను లెక్క వేసి, అమ్మేయడానికి రంగం సిద్ధం చేసింది.
జగన్ సర్కారు మీద విరుచుకపడాలన్న తపన వరకూ ఏపీ బీజేపీ బాగానే మేనేజ్ చేస్తోంది. కానీ, ఏం లాభం.? కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోవడంలేదు సరికదా, కొన్ని విషయాల్లో తెరవెనుకాల ఏపీలోని అధికార పార్టీతో లాలూచీ పడుతోందాయె.