జనసేన కొంప ముంచనున్న విశాఖ స్టీల్ ప్లాంట్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖ స్టీలు ప్లాంటుని సందర్శించబోతున్నారట అతి త్వరలో. ఈ విషయాన్ని ఇటీవలే జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆయన విశాఖ వెళ్ళారు, స్టీలు ప్లాంటు కార్మిక సంఘాల నేతలతో మాట్లాడారు. ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదన్నారు. జనసేన అధినేత ఇదే విషయాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు అలాగే బీజేపీ పెద్దలకు తేల్చి చెప్పారనీ సెలవిచ్చారు నాదెండ్ల మనోహర్. ఇంతలోనే, కేంద్రం నుంచి స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. న్యాయ సలహాదారు ఎంపిక దిశగా న్యాయ సంస్థలకు పిలుపునిచ్చింది కేంద్రం గతంలోనే. అయితే, ఏడు సంస్థలు కేంద్రాన్ని సంప్రదించాయి. అందులో ఐదు సంప్థల్ని ఎంపిక చేసిన కేంద్రం, ఈ నెల 30న ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఆ ఐదు సంస్థలకూ సూచించింది.

దాంతో, అత్యంత వేగంగా స్టీలు ప్లాంటుని విక్రయించేయాలని కేంద్రం భావిస్తోందన్న విషయం సుస్పష్టమైపోయింది. కేవలం రెండు వారాల్లోనే న్యాయ సలహాదారు ఎంపిక పూర్తయిపోతుందట. ఆ తర్వాత స్టీలు ప్లాంటు విక్రయానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల్ని వేగవంతం చేయనుంది కేంద్రం. ఇదిలా వుంటే, అక్టోబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలో పాడైపోయిన రోడ్లపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు, ఈ క్రమంలో శ్రమదానం కూడా చేస్తారు. మరి, స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ వ్యవహారంపై జనసేనాని ఎలా స్పందిస్తారు.? తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖకు వెళితే, స్టీలు ప్లాంటు కార్మిక సంఘాలకు ఏం చెబుతారు.? బీజేపీతో జనసేన తెగతెంపులకు సిద్ధమవుతుందా.? లేదంటే, బీజేపీని నిలదీయలేక.. చతికిలపడతారా.? పార్టీ కొంప ముంచేస్తారా.? వేచి చూడాల్సిందే.