Vishal Samanyudu Movie Review : ‘సామాన్యుడు’ రివ్యూ – విఫలమైన విశాల్!

రేటింగ్ : 2/5

రచన, దర్శకత్వం: తు.పా. శరవణన్

తారాగణం : విశాల్, డింపుల్ హయతీ, రవీనా రాజ్, తులసి, యోగిబాబు, మారిముత్తు, బాబూరాజ్, ఇలంగో కుమారవేల్ తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా

ఛాయాగ్రహణం : కావిన్ రాజ్

నిర్మాత: విశాల్

విడుదల : ఫిబ్రవరి 4, 2022

Vishal Samanyudu Movie Review :  తెలుగులో ఫాలోయింగ్ వున్న తమిళ స్టార్ విశాల్ గత సంవత్సరం నటించిన ‘చక్ర’, ‘ఎనిమీ’ తలుగులో విడుదలయ్యాయి. ఏమంత ఆదరణ పొందలేదు. తిరిగి ఈ సంవత్సరం తాజాగా ఈవారం ‘సామాన్యుడు’ (తమిళంలో ‘వీరమే వాగాయి సోదుమ్’ ) ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వరసగా యాక్షన్ సినిమాలే చేస్తూ వస్తున్న విశాల్ ఇంకో యాక్షన్ మూవీతో వచ్చాడు. ఈసారి యాంగ్రీ యంగ్ మాన్ పాత్ర పోషిస్తూ. శరవణన్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతూ. విజయవాడకి చెందిన తెలుగు అమ్మాయి డింపుల్ హయతీ హీరోయిన్. ఈమె తెలుగులో ‘గల్ఫ్’, ‘యురేకా’, ‘దేవీ2’ లలో నటించింది. హిందీలో ఒక మూవీలో నటించాక తిరిగి తెలుగులో ‘ఖిలాడీ’ లో నటిస్తోంది. అయితే ఇప్పుడు విశాల్- శరవణన్- డింపుల్ ల కాంబినేషన్ లో ‘సామాన్యుడు’ ఎలా వుంది? ‘సామాన్యుడు’ గా విశాల్ మెప్పిస్తాడా? ఈ విషయాలు తెలుసుకుందాం…

కథ

పోరస్ ( విశాల్) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి యువకుడు. అతడికి పోలీస్ ఇన్స్ పెక్టర్ అవ్వాలని ఆశయం. తండ్రి(మారిముత్తు) పోలీసే. తల్లి (తులసి), చెల్లెలు ద్వారకా (రవీనా రవి) వుంటారు. ద్వారక కాలేజీకి వెళ్తూ వుంటుంది. పోరస్ తన చుట్టూ జరిగే అన్యాయాల్ని సహించలేక పోతాదు. ఈ క్రమంలో హద్దు మీరిరీ ప్రవర్తిస్తూంటాడు. ఇలా చేస్తే రేపు పోలీసు ఉద్యోగం రావడం కష్టమని తండ్రి వారిస్తూంటాడు. ఇలావుండగా ద్వారకాని ఒకడు టీజ్ చేస్తూంటే పోరస్ వాణ్ని కొడతాడు. ఈ నేపథ్యంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల జనం పడే ఇబ్బందుల గురించి పోరాటం చేస్తూంటాడు ఒక సామాజిక కార్యకర్త (ఇలాంగో కుమరవేల్). ఇది ఆ ఫ్యాక్టరీ యజమాని నీలకంఠం(బాబూరాజ్) కి కోపం తెప్పిస్తుంది. దీంతో ఆ సామాజిక కార్యకర్తని హత్య చేస్తాడు నీలకంఠం. ఇది కళ్ళారా చూసిన ద్వారకా కూడా హత్యకి గురవుతుంది. దీంతో చెల్లెలి హంతకుల్ని పట్టుకోవడానికి పోరస్ సామాన్యుడుగా ఎలా ప్రయత్నించాదన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మధ్య తరగతి ప్రజలు తమ క్షేమంకోసం తమ చుట్టూ జరిగే సంఘటనల్ని పట్టించుకోకపోతే వారూ అలాటి సంఘటనల్లో ఇరుక్కుంటారనీ, అప్పుడు కాపాడే వారుండరనీ ఈ కథ ద్వారా చెప్ప దల్చాడు దర్శకుడు. కాన్సెప్ట్ బాగానే వున్నా దానికి కథా రూపమివ్వడంలో విఫలమయ్యాడు. పాత రొటీన్ మూస కథా కథనాలు, సన్నివేశాలు. చెల్లెలి హంతకులపై పగ దీర్చుకునే లాంటి రివెంజీ సినిమాలు పాత బడిపోయి చాలా కాలమైంది. వాటిలో ఇదొకటి. ఈ కథలో ఏం కొత్తదనం చూసి విశాల్ నటించడమే గాక నిర్మించాడో అర్ధం గాదు

నటనలు సాంకేతికాలు

నిర్మాతగా, హీరోగా ఈ సినిమా ద్వారా విశాల్ అందించించిన కొత్తదనమేమీ లేదు. పాత్రలో విషయం లేకపోగా నటనలో జీవం లేదు. ఎమోషన్స్ లేవు. యాంగ్రీ యంగ్ మాన్ గా యాక్షన్ లోకి దిగడానికి కథలో తగిన విషయం లేదు. నటన, ఫైట్స్ కృత్రిమంగానే వుంటాయి. హీరోయిన్ డింపుల్ హయతీ కూడా ఈ సినిమా ఎందుకు నటించిందో అర్ధం గాడు. ఆమె రొమాన్స్ సీన్లు చాలా చీప్ గా వున్నాయి. ఇక యోగిబాబు కామెడీ ఎక్కడా పేలలేదు.

ఇంటర్వెల్ కి ముందు పది నిమిషాలు తప్ప ఫస్టాఫ్ భరించడం చాలా కష్టం. కొత్త దర్శకుడికి సీన్లు తీయడం కూడా రాలేదు. బి, సి, గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సెకండాఫ్ లో విశాల్ చెల్లెలి హత్యని ఛేదించే ట్రాక్ ఒక్కటే బావున్నా అది అవసరానికి మించి సాగతీతగా వుంటుంది. యువన్ శంకర్ రాజా సంగీత్మ్లో ఒకే పాత వుంది. ‘మత్తెక్కించే కళ్ళే…’ అనే ఈ మాంటేజ్ సాంగ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. కెవిన్ ఛాయాగ్రహణం కూడా ఫర్వా లేదు.

మొత్తానికి విశాల్ కెరీర్ లో ఇంత దారుణమైన సినిమా రాలేదు. తెలుగు అభిమానులకు ఇలా తీవ్ర నిరాశని మిగిల్చే విశాల్ ని చూసి జాలి పడాల్సిన పరిస్థితి.

—సికిందర్