దుబ్బాక ఉపఎన్నిక సమయం నుంచి తెలంగాణలో ఇదే చర్చ. విజయశాంతి కాంగ్రెస్ పార్టీని వీడుతోందని… త్వరలోనే బీజేపీలో చేరుతోందని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలు నిన్నమొన్నటి వరకు రూమర్స్ గానే ఉండిపోయాయి. ఎందుకంటే.. తను బీజేపీలో చేరుతోంది అనే వార్తలపై విజయశాంతి కూడా ఏనాడూ స్పందించలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు చూద్దాంలే అని అనుకున్నారు.
అయితే.. ఇప్పటికే ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. వాళ్లను కలిసి చాలారోజులు అయినా కూడా ఆమె బీజేపీలో చేరడంపై ఎటువంటి స్పష్టత రాలేదు.
అయితే.. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ప్రచార కమిటీ చైర్ పర్సన్ బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
ఆదివారం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాములమ్మ.. వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సోమవారం బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.
ఆమె బీజేపీలో చేరుతారని తెలిసి.. కాంగ్రెస్ పెద్దలు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో విజయశాంతి కాంగ్రెస్ నాయకుల ముందు కొన్ని డిమాండ్లు పెట్టారట. ఆ డిమాండ్లను ఒప్పుకుంటేనే పార్టీలో ఉంటానని లేకపోతే బీజేపీలోకి వెళ్లిపోతానంటూ డిమాండ్లు చెప్పినా.. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో బీజేపీలోకి వెళ్లిపోవడానికి విజయశాంతి ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తోంది.
బీజేపీలో ఆమె చేరికను బీజేపీ పెద్దలు స్వాగతించడంతో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి ఎట్టకేలకు సిద్ధమయినట్టు తెలుస్తోంది.