Thammareddy Bharadwaj: ఊర్మిళ సినిమాను హీరోయిన్ విజయశాంతి చూశారు, చేస్తున్నారు అంటే తాను నమ్మలేదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఆవిడ సూపర్ స్టార్ అయిపోయాక ఆమె గురించి ఏవో చెప్తూ ఉంటారని, ఆవిడ తమకెందుకు చేస్తుందని ఆయన అనుకున్నట్టు భరద్వాజ తెలిపారు. వాళ్లు నిజం చెప్పారో, అబద్దం చెప్పారో తెలియదు గానీ, అప్పుడు రవి కిషోర్‌ను తాను అడిగానని, ఇలా చెప్తున్నారు.. ఒకసారి ఆవిడను అడిగి కన్ఫర్మ్ చేయండి. ఆమెకు ఓకే అయితే తాను వచ్చి కలుస్తానని, లేదంటే తనకు ఇంట్రస్ట్ లేదని చెప్పినట్టు ఆయన చెప్పారు. ఆవిడ అప్పటికే సూపర్ స్టార్.. అడిగి, ఆ తర్వాత నో చెప్తే బాగుండదని, అలా అనిపించుకోవడం తనకు ఇష్టం లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆమెకు ఆసక్తి ఉందని తెలిసి ఆమెను వెళ్లి కలిశానని ఆయన చెప్పుకొచ్చారు.
విజయశాంతి చిన్నప్పటి నుంచి తనకు పరిచయమేనన్న తమ్మారెడ్డి, ఆమెను కలిసిన తర్వాత ఆ సినిమాలో చేసేందుకు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశానని, ఆయన కూడా చేద్దాం అన్నారని ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత చేయటం వీలు కాదని చెప్పారని, ఎందుకంటే అప్పుడే పవన్ కల్యాణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఆయన చేస్తున్న చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్టు మెగాస్టార్ తెలిపారని, మళ్లీ ఇందులోనూ అదే క్యారెక్టర్ అయితే అన్నీ అవే పాత్రలు అవుతాయని ఆయన చెప్పినట్టు భరద్వాజ వివరించారు.
ఇకపోతే మెగాస్టార్ చేయాల్సిన క్యారెక్టర్‌లో హీరో సుమన్‌ను అనుకున్నామని తమ్మారెడ్డి అన్నారు. మెగాస్టార్ చేయడం లేదు కదా అందుకే విజయశాంతి కూడా చేయనన్నారేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చిరంజీవి చేస్తే చేస్తాను గానీ సుమన్ చేస్తే నేనేందుకు చేస్తాను… సూపర్ స్టార్‌ని కదా అని తాను అనుకున్నారో ఏమో తెలియదు గానీ ఆమె చేయనని చెప్పినట్టు ఆయన వివరించారు. ఆ తర్వాత ఆ విషయం మీద ఎలాంటి చర్చ కూడా తాను పెట్టలేదని ఆయన అన్నారు. విజయశాంతి చేయననడంతో మాలశ్రీని పెట్టి ఆ సినిమా చేశామని ఆయన స్పష్టం చేశారు.