లాక్ డౌన్ తర్వాత తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ‘ఉప్పెన, క్రాక్, జాతిరత్నాలు’ మంచి లాభాల్ని తెచ్చిపెట్టగా మిగతా సినిమాల్లో కొన్ని అరకొరగా మెప్పించగా చాలావరకు చిత్రాలు నిరాశపరిచాయి. అయితే ఇంతవరకు ప్రేక్షకుల్ని థియేటర్లలోకి తండోపతండాలుగా తీసుకుని రాగల సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. వంద శాతం ఆక్యుపెన్సీకి తోడు పెద్ద హీరోల సినిమాలు ఉంటే సినిమా హాళ్లకు పూర్వ వైభవం వస్తుందని అంతా అనుకున్నారు. అలాంటి పెద్ద హీరో సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది.
అదే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’. పవన్ సినిమా అంటేనే జనంలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందునా మూడేళ్ళ తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే ఈ చిత్రం కోసం భారీగా ఎదురుచూపులు. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే మంచి జోరుమీదున్నాయి. కొన్నిచోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తున్నారు. 9వ తేదీన ఎక్కువ శాతం థియేటర్లలో ఈ సినిమానే ఉండనుంది. సినిమా మీదున్న క్రేజ్ చూస్తుంటే లాక్ డౌన్ తర్వాత మొదటిసారి సినిమా థియేటర్లు పూర్వ వైభవాన్ని చూడబోతున్నాయని అనిపిస్తోంది. ఆడియన్స్ కూడ ఇలాంటి కరోనా టైంలో సాలిడ్ కిక్ ఇవ్వగల సినిమా ఒకటి పడితే బాగుంటుందని అనుకుంటున్నారు. వారికి ఆ కిక్ ఇవ్వగల సినిమా ‘వకీల్ సాబ్’ సినిమానే.