భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. అయితే విడుదలకు కొన్ని గంటల ముందు ఏపీ ప్రభుత్వం పాస్ చేసిన ఉత్తర్వులు ‘వకీల్ సాబ్’ డిస్ట్రిబ్యూటర్లను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యేలా చేశాయి. అన్ని సినిమాలు మొదటి వారంలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. లాక్ డౌన్ అనంతరం వచ్చిన సినిమాలు కూడ కొన్ని మొదటి వారంలో టికెట్ ధరలను పెంచుకున్నాయి. కానీ ‘వకీల్ సాబ్’కు మాత్రం టికెట్ రేట్లు పెంచరాదని, అదనపు షోలు వేయరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
దీంతో కీలకమైన మొదటిరోజు నార్మల్ ధరలకే టికెట్లను విక్రయించారు. ఈ కారణంగా కొంత నష్టం వాటిల్లిందని గగ్గోలు పెడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కేవలం పవన్ సినిమాకే ఎందుకిలా చేస్తున్నారని హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ హైకోర్టు తీర్పు ఇస్తూ 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లకు, ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈరోజు, రేపు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కలిగింది డిస్ట్రిబ్యూటర్లకు.